న్యూయార్క్: అమెరికా ఐటీ కంపెనీ ఐబీఎం షేర్లు మంగళవారం ఏకంగా 25 శాతం పైగా పతనమయ్యాయి. కంపెనీ వాల్యూ 70 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.7 లక్షల కోట్లు) తగ్గింది. బుధవారం మరో 1.2 శాతం నష్టపోయింది. ఐబీఎం తన భవిష్యత్ ఆదాయ అంచనాలను భారీగా తగ్గించుకోవడంతో షేర్లు పడుతున్నాయి. కంపెనీలు సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లను పక్కనబెట్టి, ఏఐ సర్వర్లు, స్టోరేజ్, మెమొరీ చిప్స్ వంటి హార్డ్‌వేర్‌ను ముందే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో ఐబీఎం అమ్మకాలు తగ్గాయి.
యాంత్రోపిక్ విడుదల చేసిన సరికొత్త 'మైథోస్' ఏఐ మోడల్ పాత సాఫ్ట్‌వేర్లలోని సైబర్ లోపాలను సులభంగా గుర్తిస్తోంది. దీంతో క్లయింట్లు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను ఆపేసి, సైబర్ సెక్యూరిటీ బడ్జెట్లను పెంచుతున్నారు. క్లిష్టమైన సమయంలో వేగంగా స్పందించలేకపోయామని, కొన్ని పెద్ద ఒప్పందాలు వాయిదా పడ్డాయని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు.
