నియోజకవర్గాల అభివృద్ధికి ఈక్విప్ వేదిక..ఉపాధి అవకాశాలను పెంచేలా పనిచేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

నియోజకవర్గాల అభివృద్ధికి ఈక్విప్ వేదిక..ఉపాధి అవకాశాలను పెంచేలా పనిచేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా నియోజకవర్గాల అభివృద్ధికి ఈక్విప్ సంస్థ ఒక మంచి వేదికగా పని చేస్తుందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, అక్కడి వనరులను ఉపయోగించి ఉపాధి అవకాశాలు పెంచేలా పనిచేయాలని సూచించారు. బుధవారం శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌‌లో రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్, ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. 

ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, డిజిటల్ సేవలు, ఉపాధి, ఆర్థికాభివృద్ధి వంటి రంగాల్లో ఈక్విప్ పనిచేస్తుందని చెప్పారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం మంచి పరిణామమన్నారు. ఈక్విప్‌‌తో కుదిరిన ఎంఓయూ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఈక్విప్ ప్రతినిధులు వింధ్యా ధర్మరాజు, లక్ష్మీనారాయణ, ఐ ల్యాబ్స్ చైర్మన్ శ్రీనిరాజు తదితరులు పాల్గొన్నారు.