ఇథనాల్‌‌‌‌ ముసుగులో బియ్యం దందా!..పక్కదారి పడుతున్న కేంద్ర రాయితీ కోటా

ఇథనాల్‌‌‌‌ ముసుగులో బియ్యం దందా!..పక్కదారి పడుతున్న కేంద్ర రాయితీ కోటా
  • విదేశాలకు తరలిస్తూ వందల కోట్లు వెనకేసుకుంటున్న అక్రమార్కులు
  • కిలో రూ.22 చొప్పున సబ్సిడీ బియ్యం సేకరించి రూ.60 చొప్పున బయటకు
  • ఇటీవల నల్గొండలో విజిలెన్స్ మెరుపు దాడులతో గుట్టురట్టు
  • ఆధారాలు దొరికినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు

హైదరాబాద్, వెలుగు:ఇథనాల్ ముసుగులో రాష్ట్రంలో పెద్దఎత్తున బియ్యం దందా సాగుతున్నది. ఇథనాల్ ఫ్యాక్టరీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు విదేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ఓ ఇథనాల్​ ఫ్యాక్టరీకి కేటాయించిన బియ్యం నల్గొండ శివారులోని ఒక మూతపడిన పైపుల కంపెనీలో విజిలెన్స్​ అండ్​ ఎన్ ఫోర్స్​మెంట్ కు పట్టుబడడం ఇందుకు ఊతమిస్తున్నది. 

కామారెడ్డి జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీకి నల్గొండలో బియ్యం కేటాయించడం ఒక వింత అయితే, వాటిని చిన్న సంచుల్లోంచి, విదేశీ ఎగుమతుల కోసం వాడే సూపర్​ బ్యాగ్​లలోకి మార్చడాన్ని బట్టి ఈ బియ్యాన్ని అక్రమ మార్గంలో కాకినాడ పోర్ట్​కు తరలిస్తున్నట్లు స్పష్టమైంది. విషయం బయటకు పొక్కి రెండు వారాలు కావస్తున్నా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చూస్తే దీని వెనుక పెద్దతలకాయల పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. కేవలం ఇథనాల్​ఫ్యాక్టరీలకు కేటాయించిన బియ్యమే పక్కదారి పడుతున్నాయా ? లేదంటే సివిల్​ సప్లయ్స్​ టెండర్లలోనూ వివిధ అవసరాల పేరుతో తీసుకుంటున్న బియ్యం సైతం ఇలాగే విదేశాలకు తరలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

విజిలెన్స్ దాడులతో గుట్టురట్టు.. 

గత నెల 27-, 28 తేదీల్లో రాష్ట్ర విజిలెన్స్ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్ బృందం నల్గొండలో మెరుపు దాడి చేసింది. పట్టణ శివారులోని పానగల్‌‌లో ‘శ్రీనిధి పైప్స్’అనే మూతపడిన పైపుల కంపెనీపై రైడ్​ చేయగా అక్కడ కాకినాడ పోర్టుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 26 నుంచి 28 బియ్యం లారీలు పట్టుబడ్డాయి. ఎఫ్​సీఐ నుంచి తీసుకువచ్చిన చిన్న సంచుల్లోని బియ్యాన్ని విదేశీ ఎగుమతులకు వాడే 2 టన్నుల సూపర్ బ్యాగుల్లోకి మారుస్తూ అడ్డంగా దొరికిపోయారు. అక్కడ లభించిన డాక్యుమెంట్స్​ను బట్టి అవి కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డికి చెందిన ‘వివేక్ బయో ప్రొడక్ట్స్​ఫ్యాక్టరీ’కి ఎఫ్​సీఐ కేటాయించిన బియ్యమని తేలింది.

 వీటిని అక్రమ మార్గంలో కాకినాడ పోర్ట్​కు, అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు పక్కా ఆధారాలు దొరికినప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. వివరాలు బయటకు వెల్లడించలేదు. పైగా ఆ బియ్యం నిబంధనల ప్రకారం కేటాయించినవేనని, ఎలాంటి అక్రమాలు జరగలేదని లోకల్​మీడియాను నమ్మించారు. వాస్తవానికి ‘వివేక్ బయో ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ’కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉంది. కానీ ఆ సంస్థకు కేటాయించిన రాయితీ బియ్యాన్ని నల్గొండ డిపో నుంచి లిఫ్ట్​చేశారు. ఎల్లారెడ్డికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్న నల్గొండను ఎంచుకోవడం వెనుక అక్రమార్కులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 

ఇక్కడి నుంచి నేషనల్​ హైవే 65 మీదుగా కాకినాడ పోర్టుకు వెళ్లడం సులువు కాబట్టే నల్గొండను ఎంచుకున్నట్లు భవిస్తున్నారు. కాగా, ఎఫ్​సీఐ నుంచి లిఫ్ట్ చేసిన బియ్యాన్ని పానగల్ శివార్లలోని పాత పైపుల కంపెనీకి చేర్చడం, కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ఇంత భారీ నిల్వలు ఉంచడం తీవ్రమైన నేరం. మొత్తంగా 8,998 మెట్రిక్ టన్నుల దంపుడు బియ్యాన్ని తరలించేందుకే ఈ రూట్ మ్యాప్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, విజిలెన్స్ దాడుల్లో దొరికిపోయిన వివేక్ బయో ప్రొడక్ట్స్​ కంపెనీ ఒక కట్టు కథను ప్రచారంలోకి తెచ్చింది. తాము ఈ బియ్యాన్ని సివిల్ సప్లైస్ వేలంలో కొన్నామని ఆ సంస్థ మొదట బుకాయించింది. కాగా, అవి సివిల్​ సప్లయ్స్​ వేలం వేసిన బియ్యం కాదని, ఎఫ్​సీఐ నుంచి తీసుకున్న బాయిల్డ్​ బియ్యమని తేలింది. మరోవైపు తమ గోడౌన్ల నుంచి ఒక్క గింజ కూడా విడుదల కాలేదని పౌర సరఫరాల సంస్థ క్లారిటీ ఇచ్చింది. 

ఇథనాల్​ బ్లెండింగ్ ​ప్రోగ్రామ్​లో భాగంగా.. 

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. ఇంధన తయారీ కోసం ఏటా 9లక్షల49వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ఎఫ్​సీఐ సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రంలోని ఇథనాల్​ ఫ్యాక్టరీలకు ప్రతి నెలా దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల కోటా ఇస్తోంది. ఇలా ఏడాదికి 2.30 లక్షల టన్నుల సబ్సిడీ బియ్యాన్ని ఇథనాల్‌‌గా మార్చడానికి కేవలం 6 ఫ్యాక్టరీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. అందులో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ‘వివేక్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’సంస్థ ఒకటి. మిగిలిన 5 ప్లాంట్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 

ఈ ఇథనాల్ డిస్టిలరీలకు బియ్యం కేటాయింపు ప్రక్రియ ఓపెన్​ టెండర్లు లేదంటే ఈ-వేలం ద్వారా జరగదు. చమురు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్యాక్టరీలకు మాత్రమే ఎఫ్​సీఐ నేరుగా బియ్యం సరఫరా చేస్తోంది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 2,250 కే కేటాయిస్తోంది. ఇలా పొందిన బియ్యాన్ని ఇథనాల్‌‌గా మార్చిన తర్వాత తప్పనిసరిగా ‘వినియోగ ధ్రువీకరణ పత్రాలు’ సమర్పించాల్సి ఉంటుంది. వాటిని కూడా మేనేజ్​ చేస్తున్నట్లు నల్లగొండ ఘటన ద్వారా స్పష్టమైంది. 

కిలో రూ.22 బియ్యం.. రూ.60కి విక్రయం 

ఇథనాల్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్​సీఐ ద్వారా తక్కువ రేటుకు, కిలో కేవలం రూ. 22.50 చొప్పున బియ్యం కేటాయిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం వడ్లు క్వింటాల్​ మద్దతు ధరే 2,400 కుపైగా ఉంది. క్వింటాల్​ వడ్లను మారాడిస్తే 60 నుంచి 65 కిలోల బియ్యం వస్తాయి. మిల్లింగ్​, హమాలీ, గోడౌన్​చార్జీలు కలుపుకుంటే క్వింటాల్​ బియ్యానికి రూ. 4వేల నుంచి రూ.4500 దాకా ఖర్చవుతుంది. 

కానీ కేంద్ర ప్రభుత్వం ఇథనాల్​తయారీ కోసం రాయితీపై రూ.2250కే సరఫరా చేస్తోంది. దీనిని అవకాశంగా తీసుకున్న ఇథనాల్​ కంపెనీల యాజమాన్యాలు, అధికారులు బియ్యాన్ని విదేశాలకు మళ్లించి కోట్లు వెనుకేసుకుంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో బియ్యం రూ. 60 కి పైగా పలుకుతోంది. దీంతో అక్రమార్కులకు క్వింటాల్​కు కనీసం రూ. 30 చొప్పున లాభం వస్తోంది. నల్గొండలో పట్టుబడిన బియ్యం విలువ ఓపెన్ మార్కెట్లో రూ.33.7 కోట్లు ఉంటుంది. 

ఇక ఏడాదికి ఇచ్చే బియ్యం కోటా మొత్తం పక్కదారి పట్టిస్తే ఈ మొత్తం విలువ రూ.700 కోట్ల దాకా ఉంటుంది. ఇందులో రూ.300 కోట్లను అక్రమార్కులకు అయాచితంగా దక్కినట్లే. కాగా, ఇది కేవలం ఇథనాల్​పేరుతో కేటాయిస్తున్న బియ్యానికే పరిమితమైందా? మిగిలిన అవసరాల కోసం ఇచ్చే బియ్యం కూడా ఇలాగే అక్రమంగా తరలివెళ్తోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

కాగా, ఇప్పటివరకు ఏయే ఫ్యాక్టరీలకు ఎంత మొత్తం బియ్యం కేటాయించారు? ఉత్పత్తి అయిన ఇథనాల్​ ఎంత? పక్కదారి పట్టిన బియ్యం ఎన్ని? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తే వేల కోట్ల బియ్యం రాకెట్​బయటకు వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌‌లో బియ్యం ధర క్వింటాలుకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు పలుకుతుండటంతో ఆహార భద్రత దృష్ట్యా ఇంత భారీ సబ్సిడీలతో బియ్యాన్ని బయోఇంధనం తయారీకి కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల భవిష్యత్​లో ఆహార కొరత తలెత్తవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.