జీవో 190 అమలు కోసం అటవీ శాఖ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత తమ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వారు ఆశించారు. కానీ నెలలు గడుస్తున్నా అమలుపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతోంది. ఇది కేవలం బదిలీల అంశం మాత్రమే కాదు, ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక మానవీయ సమస్య. చాలామంది అటవీ శాఖ ఉద్యోగులు కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం, ఆరోగ్య సమస్యల సమయంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం వంటి ఇబ్బందులు వారి నిత్యజీవితంలో భాగమయ్యాయి.
అడవులను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తూ, తమ కుటుంబాలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉండటం నిజంగా బాధాకరం. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంతో జరిగిన సమావేశం ఆశాజనకంగా మారింది. సమావేశంలో బాధిత ఉద్యోగుల సమస్యలను ఓర్పుగా విన్న రాష్ట్ర నాయకత్వం, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ అవసరమైతే గౌరవ అటవీ శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించి, నోటిఫికేషన్ వెలువడే ముందే పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడం ఉద్యోగుల్లో కొత్త ఆశను నింపింది.
అయితే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉత్తర్వు అమలులో అనవసర జాప్యం కొనసాగితే ఉద్యోగుల్లో నిరుత్సాహం పెరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో త్వరితగతిన అమలు జరిగితే ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో విశ్వాసం మరింత బలపడుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల విలువ వాటిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే తెలుస్తుంది. జీవో190 అమలు త్వరితగతిన జరిగి, అటవీ శాఖ ఉద్యోగుల న్యాయమైన ఆకాంక్షలు నెరవేరాలని ఆశిద్దాం.
- మట్టపల్లి ముఖేష్ గౌడ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
