వాన నీటిని ఒడిసిపట్టేలా..కేయూలో 9 చెక్ డ్యాంలు, 4 కుంటలు, 70 ఇంకుడు గుంతలు

వాన నీటిని ఒడిసిపట్టేలా..కేయూలో 9 చెక్ డ్యాంలు, 4 కుంటలు, 70 ఇంకుడు గుంతలు
  • క్యాంపస్ చుట్టూ సమృద్ధిగా భూగర్భజలాలు
  • వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రతి బిల్డింగ్ కో ఇంకుడుగుంత
  • ఎల్ నినో ఎఫెక్ట్ తో మరోసారి వర్సిటీ ఆఫీసర్లు అప్రమత్తం
  • కరువు దరిచేరకుండా చెక్ డ్యాంలలో పూడికతీత

హనుమకొండ, వెలుగు: ఎల్ నినో ఎఫెక్ట్ తో రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటి బావులు ఎండిపోతుండగా.. అర్బన్ ఏరియాల్లో బోర్లు ఇంకిపోతున్నాయి. కానీ, ఓరుగల్లు నగరంలో వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న కాకతీయ యూనివర్సిటీ మాత్రం కరువును జయించింది. అంతటా కరువు పరిస్థితులు తాండవిస్తున్నా.. వర్సిటీ చుట్టూ భూగర్భజలాలతో కళకళలాడుతోంది. ఇందుకు కాకతీయుల శైలిలో నిర్మించిన గొలుసుకట్టు చెక్ డ్యాంలు, కుంటలే కారణం కాగా.. ఎల్ నినో ఎఫెక్ట్ మున్ముందు కూడా పడకుండా వర్సిటీ ఆఫీసర్లు క్యాంపస్ లోని చెక్ డ్యాంలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. పూడికతీత పనులు చేపట్టి ఒక్క వానపడినా ఆ నీళ్లన్నింటినీ ఒడిసి పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 గొలుసుకట్టులా చెక్ డ్యాంలు, కుంటలు

రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తరువాత అంతటి పేరున్న కాకతీయ యూనివర్సిటీ.. వరంగల్ నడిమధ్యన సుమారు 620 ఎకరాల మేర విస్తరించి ఉంది. దాదాపు 407 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న వరంగల్ మహానగరానికి దట్టమైన చెట్లు, వివిధ రకాల మొక్కలతో కాకతీయ యూనివర్సిటీ లంగ్ స్పేస్ గా ఉపయోగపడుతోంది.

 కాగా, దాదాపు రెండు దశాబ్దాల కిందట కరువు పరిస్థితులు వెంటాడటంతో వర్సిటీలో నీళ్లకు ఇబ్బందులు తలెత్తి విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో జియాలజీ డిపార్ట్​మెంట్ హెచ్​ఓడీ డాక్టర్​మల్లికార్జున్ రెడ్డి ఈ కరువుకు చెక్ పెట్టేందుకు ఆలోచన చేశారు. ఈ మేరకు క్యాంపస్ లో భూగర్భజలాలు పెంచేందుకు ప్రణాళిక రచించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్టిఫిషియల్ రీచార్జ్ స్ట్రక్షర్స్ ప్రాజెక్ట్ కింద 2011లోనే రూ.70 లక్షలతో తొమ్మిది చెక్ డ్యాంలు, నాలుగు కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు పడినప్పుడు వరద నీరు వృథాగా పోకుండా ఎక్కడికక్కడ స్టోర్ చేసేలా వీటిని నిర్మించి, ఒకటి నిండిన తరువాత మరొక దాంట్లోకి నీళ్లు వచ్చేలా కాకతీయుల గొలుసుకట్టు విధానాన్ని అవలంబించారు.

పరుగెత్తే నీళ్లను భూమిలోకి ఇంకించేలా ప్లాన్

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ ను రెండు భాగాలుగా పరిగణించి గొలుసుకట్టు చెక్ డ్యాంలు నిర్మించారు. ఈ మేరకు వర్సిటీలోని ఆడిటోరియం ముందు నుంచి పద్మాక్షి హాస్టల్ వరకు వరుసగా నాలుగు, మరోవైపు కేయూ సెకండ్ గేట్ నుంచి మరో ఐదు చెక్ డ్యాంలు నిర్మించారు. వాటికి అనుబంధంగా నాలుగు కుంటలు కూడా తవ్వారు. వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీరు వృథాగా నాలాల్లోకి పరుగెత్తకుండా.. ఎక్కడి నీటిని అక్కడే ఇంకించేలా పక్కా ప్లాన్ అమలు చేశారు. 

అంతేకాకుండా కేయూ క్యాంపస్ లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఎగ్జామినేషన్స్ బ్రాంచ్, ఎస్డీఎల్సీఈ, వివిధ డిపార్ట్​మెంట్లు, లైబ్రరీ, హాస్టల్స్ ఇలా అన్నీ కలిపి 70కిపైగా బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగులపై పడిన వర్షపు నీళ్లు కూడా అక్కడే ఇంకేలా ఎక్కడికక్కడ 70 ఇంకుడు గుంతలు కూడా నిర్మించారు. వర్షపు నీళ్లు ఇంకుడు గుంతల్లోకి చేరేలా ఏర్పాట్లు చేసి, భూగర్భజలాలను పెంచడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా క్యాంపస్ లో సగటున 4 మీటర్ల లోతునే గ్రౌండ్ వాటర్ ఉండగా.. వర్సిటీలోని 35 బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. యూనివర్సిటీ చుట్టుపక్కల కాలనీల్లో కూడా ఇంతవరకు ఎక్కడా నీటి ఎద్దడి పరిస్థితులే లేవని అంటున్నారు.

ఎల్ నినో ఎఫెక్ట్ తో చెక్ డ్యాంల పునరుద్ధరణ


ప్రస్తుతం ఎల్ నినో ఎఫెక్ట్ తో అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, కాకతీయ యూనివర్సిటీకి ప్రస్తుతం ఇబ్బంది లేనప్పటికీ ఎల్ నినో లాంటి విపత్తులు భవిష్యత్ లో తలెత్తినా ఎదుర్కొనేందుకు ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు క్యాంపస్ లోని 9 చెక్ డ్యాంలు, 4 కుంటలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ మేరకు నాలుగు రోజులుగా వాటిల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆ మట్టిని వర్సిటీలోని లోతట్టు ప్రాంతాల్లో పోస్తున్నారు. సాధారణంగా జూన్ నెలలోనే వర్షాలు కురవాల్సినప్పటికీ.. ఎప్పుడు వాన పడినా ఒడిసి పట్టేలా చెక్ డ్యాంలు, కుంటలను సిద్ధం చేస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. 

కరువు లేకుండా చేశాం..

పరుగెత్తే నీళ్లను నడిపించి.. నడిచే నీళ్లను నిలిపి.. భూమిలోకి ఇంకించాలనే ఆశయంతో దాదాపు 15 ఏండ్ల కిందటే క్యాంపస్ లో చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించాం. వాటి వల్ల ఇప్పుడు వర్సిటీ చుట్టూ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇలా యూనివర్సిటీకి కరువు దరిచేరకుండా చేయడంలో సక్సెస్ అయ్యాం. చుట్టుపక్కల కాలనీల్లో కూడా ఎక్కడా నీటి ఎద్దడి లేదు. ప్రతి వర్షాకాలం సగటున 20 వర్షాలైనా పడతాయి. కానీ, ఇంతవరకు చినుకు జాడలేదు. అందుకే ఒక్క వాన పడినా నీటిని చెక్ డ్యాంలు, కుంటల్లో ఒడిసిపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

– డాక్టర్​ఆర్.మల్లికార్జున్ రెడ్డి, హెచ్​ఓడీ, జియాలజీ డిపార్ట్​మెంట్-