- ఆ పేరు ఇతరులు వాడుకుంటామంటే మా పార్టీ కార్యకర్తలు అంగీకరించరు: కేటీఆర్
- పార్టీకన్నా ఎవరూ ఎక్కువ కాదు
- వంద శాతం మా తప్పుల వల్లే పవర్ కోల్పోయాం
- తెలంగాణలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ
న్యూఢిల్లీ, వెలుగు: ఎవరైనా ‘టీఆర్ఎస్’ పార్టీ పేరు పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు తెలిపి ఉండవచ్చన్నారు. తానైనా, ఇంకెవరైనా పార్టీ కంటే ఎక్కువ కాదని, ఫైనల్‌గా పార్టీయే సుప్రీం అని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవితపై ఆయన ఈ మేరకు పరోక్షంగా స్పందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఎంపీ వద్దిరాజు నివాసంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.
‘‘టీఆర్ఎస్ అంటే 22 ఏండ్ల ప్రస్థానం. ఇమేజ్, క్రెడిబులిటి, ఒక నాయకుడి కీర్తి. ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఒక రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. అలాంటి పేరును వేరే ఎవరైనా సొంతం చేసుకోవాలంటే.. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా అభ్యంతరం తెలుపుతారు. 2022లో పార్టీ పేరు మార్చుకున్నాక ఆరేండ్లు టీఆర్ఎస్ పేరును కేంద్ర ఎన్నికల సంఘం సీజ్ చేసింది. ఈపేరు కావాలంటే ఎన్నికల సంఘం అభ్యంతరాలు కోరతది, అందుకు మా వాళ్లు స్పందిస్తారు’’ అని కవిత పార్టీ పేరుకు సంబంధించిన వివాదంపై ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి విభేదించి కొందరు బయటకు పోయారని.. ఎవరి అజెండాలు, రాజకీయాలు వాళ్లకు ఉంటాయన్నారు. ఇష్టం లేక పార్టీ నుంచి పోయిన వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు.
100 శాతం మా తప్పులున్నయ్..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి 100 శాతం తమ తప్పులున్నాయని కేటీఆర్ అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, సరిదిద్దుకుంటామన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను ప్రజలను నమ్మారన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నందున, ఇతరులకు ఒక చాన్స్ ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం 1.8 శాతం ఓట్లు, దాదాపు 4 లక్షల ఓట్లతో తేడాతో ఓడిపోయామన్నారు. అయితే, 2018 తో పోల్చితే బీఆర్ఎస్ గ్రాఫ్ 10 శాతం తగ్గిందని ఒప్పుకున్నారు. తెలంగాణలో కుల రాజకీయాలకు తావు లేదని, ఆ పరిస్థితి ఎప్పటికీ రాదన్నారు. చివరి ఆరు నెలల్లో ఏదో మ్యాజిక్ చేసి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని.. కానీ, శని నెత్తిన ఎక్కి కూర్చుంటే ఓటమి తప్ప కాంగ్రెస్‌కు మరేమీ మిగలదన్నారు.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిస్థితే వస్తుందని, కనీసం ఆపార్టీకి డిపాజిట్ కూడా దక్కదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్, కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉంటారని, కానీ బీజేపీకి సీఎం అభ్యర్థే లేడన్నారు. డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో సీట్లు పెరగడం ఖాయమన్నారు. అయితే, ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గకుంటేనే పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు.
మేముంటే మెట్రో పరుగులు పెట్టేది..
బీఆర్ఎస్ హయాంలోనే రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తి చేశామని కేటీఆర్ చెప్పారు. దాదాపు 33 కి.మీ. లైన్ ను 24 నెలల్లో పూర్తి చేసేందుకు ఎల్ అండ్ టీ టెండర్లు దక్కించుకుందన్నారు. 24 నెలలు అంటే.. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ కు మెట్రో పరుగులు పెట్టేదన్నారు. కానీ, అధికారంలోకి రాగానే ఈ టెండర్లు రద్దు చేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం 28 నెలల తర్వాత మళ్లీ మెట్రో విస్తరణ పేరిట డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
