- ఇటీవల కంపెనీల ప్రతినిధులతో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు చర్చలు
- రూ.220 కే సిమెంట్ బస్తా ఇవ్వాలని విజ్ఞప్తి
- రూ.270 ఇస్తే ఓకే అని చెప్పిన ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఇటీవల సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో హౌసింగ్, పరిశ్రమల శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఒక సిమెంట్ బస్తా ధర దాదాపు రూ. 330 వరకు ఉంది. అయితే, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం సిమెంట్ బస్తాను రూ. 220 లకే సరఫరా చేయాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులను ప్రభుత్వం కోరింది. రాష్ట్రం మొత్తానికి బల్క్ ఆర్డర్ కింద ఒకే ధరకు సరఫరా చేయాలని ప్రతిపాదించింది. అయితే కంపెనీల ప్రతినిధులు మాత్రం తాము ఒక బస్తా రూ. 270 వరకు ఇస్తామని సూచించారు. ప్రభుత్వం కోరిన రూ. 220 కి ఇస్తే తమకు నష్టాలు వస్తాయని తెలిపారు.
ఒక్కో ఇంటికి తేలిన లెక్క
ప్రభుత్వ అంచనాల ప్రకారం.. పటిష్టమైన ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్, స్టీల్ పరిమాణాన్ని అధికారులు లెక్క తేల్చారు. ఒక్కో ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి ముగింపు వరకు 180 బస్తాల సిమెంట్, 15 క్వింటాళ్ల ఐరన్ అవసరమవుతుందని స్పష్టం చేశారు. ధర ఖరారైన తర్వాత లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ఎలాంటి అదనపు రవాణా ఛార్జీలు లేకుండా నేరుగా సరఫరా చేయాలని మంత్రులు కంపెనీలకు స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఒక్కో బస్తాపై రూ. 10 తగ్గినా లబ్ధిదారుడికి లేదా ప్రభుత్వానికి ఒక్కో ఇంటిపై రూ. 1,800 వరకు ఆదా అవుతుంది. అదే రూ. 330 మార్కెట్ ధర ఉన్న సిమెంట్‌ను రూ. 220 లేదా రూ. 230 కే సాధించగలిగితే.. ఒక్కో ఇంటిపై దాదాపు రూ. 18,000 వరకు కేవలం సిమెంట్ రూపంలోనే ఆదా అయ్యే అవకాశం ఉంది.
స్టీల్ రేట్లపైనా చర్చలు
సిమెంట్‌తో పాటు స్టీల్ ధరలను కూడా వీలైనంత మేర తగ్గించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఒక్కో ఇంటికి 15 క్వింటాళ్ల స్టీల్ అవసరం కాబట్టి, పెద్ద ఎత్తున కొనుగోలు చేసే ప్రభుత్వానికి సబ్సిడీ ధరలకే అందించేలా ఉక్కు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు తుది విడత చర్చలు జరపనున్నారు.
