మొదటి కాన్పులో కవలలు పుట్టినా..రెండో ప్రసవానికి సెలవు ఇవ్వాల్సిందే:గురుకుల సొసైటీని ఆదేశించిన హైకోర్టు

మొదటి కాన్పులో కవలలు పుట్టినా..రెండో ప్రసవానికి సెలవు ఇవ్వాల్సిందే:గురుకుల సొసైటీని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఒకే కాన్పులో ఇద్దరు జన్మించారన్న కారణంతో రెండో ప్రసవానికి ప్రసూతి సెలవు నిరాకరించడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కవలల జననాన్ని రెండు వేర్వేరు ప్రసవాలుగా పరిగణించలేమని జస్టిస్ కె. శరత్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ ఎస్సీ గురుకుల విద్యాసంస్థలో జూనియర్ లెక్చరర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న జాడి స్వరూపరాణి 2023లో తొలి ప్రసవంలో కవలలకు జన్మనిచ్చారు. 

అనంతరం రెండో గర్భధారణ సందర్భంగా ప్రసూతి సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది గట్టు వినయ్‌‌‌‌‌‌‌‌కుమార్ ఇద్దరు పిల్లలు ఒకే ప్రసవంలో జన్మించారని, రెండో ప్రసవానికి సెలవు నిరాకరించడం మహిళల హక్కులకు విరుద్ధమని వాదించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది మాత్రం తెలంగాణ జీవో నెం.50 ప్రకారం ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు మాత్రమే ప్రసూతి సెలవు వర్తిస్తుందని, అదే నిబంధనను అనుసరించి సెలవు తిరస్కరించామని కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం, ప్రసూతి సెలవు నిబంధనలను సంక్షేమ దృక్పథంతో అమలు చేయాలని స్పష్టం చేసింది. కవలలు పుట్టడం పూర్తిగా సహజ జీవసంబంధమైన ప్రక్రియ అని, మహిళ నియంత్రణలో ఉండే అంశం కాదని పేర్కొంది. కుటుంబ నియంత్రణ విధానాల పేరుతో మహిళలకు లభించే మాతృత్వ హక్కులను కుదించలేమని వ్యాఖ్యానించింది. తమిళనాడుకు చెందిన జె. శర్మిల కేసు తీర్పు తర్వాత అక్కడి ప్రభుత్వం నిబంధనలను సవరించి తొలి ప్రసవంలో కవలలు జన్మిస్తే రెండో ప్రసవానికీ సెలవు వర్తించేలా చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 

అలాగే ఏపీ ప్రభుత్వం కూడా 2025లో సంబంధిత నిబంధనల్లో మార్పులు చేసిన అంశాన్ని ప్రస్తావించింది.  ఈ నేపథ్యంలో తొలి ప్రసవంలో కవలలు జన్మించిన మహిళ రెండో ప్రసవానికీ ప్రసూతి సెలవుకు అర్హురాలని కోర్టు స్పష్టం చేసింది. జాడి స్వరూపరాణికి రెండో ప్రసవానికి 180 రోజుల సెలవు మంజూరు చేసి, ఆ కాలానికి సంబంధించిన పూర్తి వేతనం చెల్లించాలని గురుకుల సొసైటీని ఆదేశించింది.