- కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహాకారం అందిస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రకటించారు. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల నుంచి తక్షణమే రూ.150 కోట్ల విడుదలకు ఆయన అంగీకరించారు. బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ శాఖ సెక్రటరీ విజయేంద్ర బోయి.. కేంద్ర మంత్రి అథవాలేను బేగంపేట టూరిజం ప్లాజాలో కలిశారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, సంక్షేమ విద్యాసంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.
కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో కేంద్ర వాటా నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలన్నారు. తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల సమగ్ర ఆధునీకరణ కోసం రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ కేంద్ర నిధుల్లో తొలి విడతగా రూ.150 కోట్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, రూ.300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై వచ్చే నెలలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని ఎస్సీ గురుకుల హెడ్ ఆఫీస్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. సొసైటీ పరిధిలో ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రకృతి మిత్రులకు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
