వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల సమాచారాన్ని చైనా అక్రమంగా సేకరించిందని ఆరోపించారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా ఉల్లంఘన అని అభివర్ణించారు. చైనా జోక్యంతోనే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను జో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యాయని పునరుద్ఘాటించారు.
చైనా వల్ల అమెరికా ఎన్నికల వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. శుక్రవారం (జులై 17) వైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘2020 ఎన్నికల సమయం నుంచి కొన్నేళ్లపాటు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా ఉల్లంఘనకు పాల్పడింది. దీని ఫలితంగా చైనా 22 కోట్ల అమెరికా ఓటర్ల ఫైళ్లను అక్రమంగా స్వాధీనం చేసుకుంది. అమెరికా ఎన్నికల వ్యవస్థను చైనా దెబ్బతీసింది. ఇంటలిజెన్స్ అధికారులు సంవత్సరాలు తరబడి ఈ విషయాన్ని దాచిపెట్టారు.
లీకైన డేటాలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ ప్రాధాన్యతల వంటి సున్నితమైన డేటా ఉంది. అమెరికాలో అక్రమంగా లక్షల మంది ఓటర్లు రిజస్టర్ అయ్యారు. చైనా వల్ల అమెరికా ఎన్నికల వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఓటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేయకపోతే భవిష్యత్ అమెరికా ఎన్నికలు రిగ్గింగ్‌కు, చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఎన్నికల మౌలిక సదుపాయాలలో దిగ్భ్రాంతికరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. డెమోక్రాట్లు ఉన్న రాష్ట్రాల్లో విదేశీయులు అక్రమంగా రిజస్టర్ అయ్యారని చెప్పారు. అమెరికా ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా ఉందన్నారు. అమెరికా ఓటర్ల జాబితా విదేశీ ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి.. మా ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ కౌంటింగ్ ప్రమాదంలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి చైనా, ఇతర దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓటర్ ఐటీ, పౌరసత్వ నిరూపణ లేకుండానే ఓటు వేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఎన్నికల అక్రమాలు అరికట్టేందుకు సంస్కరణలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఓటర్ల నమోదులో పౌరసత్వ పత్రాలు చూపించడం తప్పనిసరి చేయాలని అన్నారు.
