- అడ్డుకున్న పోలీసులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించేందుకు సీపీఐ లీడర్లు ప్రయత్నించారు. గురువారం ఉదయం ఇండ్ల వద్దకు వెళ్లిన నాయకులు పరిసరాల్లో పెరిగిన గడ్డి, మొక్కలను తొలగించారు. అనంతరం ఇండ్లలోకి ప్రవేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, సీపీఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఏండ్లు గడుస్తున్నా పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేసిందని, కాంగ్రెస్ సైతం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
తీగలగుట్టపల్లి, చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని, ఇండ్లను సీపీఐ ఆధ్వర్యంలో పేదలకు పంచుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బీర్ల పద్మ, కొట్టె అంజలి, మురళి, కసిబోజుల సంతోష్ చారి, కాల్వ శ్రీనివాస్ యాదవ్, అల్లేపు రాజు, ఓర్సు కొమురయ్య పాల్గొన్నారు.
