దక్షిణ ఇరాన్‌లోని పోర్ట్ సిటీ అయిన 'బందర్ ఖమీర్' ప్రాంతంలో నిన్న (జులై 16 )రాత్రికి రాత్రే అమెరికా జరిపిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని హార్మోజ్‌గాన్ మెడికల్ యూనివర్సిటీని సూచిస్తూ ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' (IRNA) వెల్లడించింది.
ఇరాన్ మీడియా సమాచారం ప్రకారం... హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) దగ్గర ఉన్న ఒక విమానాశ్రయం, రెండు బ్రిడ్జీలపై అమెరికా నిన్న రాత్రి బాంబుల దాడి చేసింది. వీటితో పాటు బందర్ ఖమీర్ కౌంటీ పరిధిలోని కోహౌరెస్తాన్ గ్రామం, షోర్ నది సమీపంలో ఉన్న మరో రెండు వంతెనలనూ అమెరికా టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడింది.
