సూసైడ్ ఐడియాల కోసం చాట్ చేస్తే తల్లిదండ్రులకు అలర్ట్ మెసేజ్.. టీనేజర్ల సేఫ్టీకి మెటా కీలక నిర్ణయం

సూసైడ్ ఐడియాల కోసం చాట్ చేస్తే తల్లిదండ్రులకు అలర్ట్ మెసేజ్..  టీనేజర్ల సేఫ్టీకి మెటా కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ తన ప్లాట్‌‌ఫామ్‌‌లైన ఇన్‌‌స్టాగ్రామ్, ఫేస్‌‌బుక్, వాట్సాప్, మెసెంజర్ యాప్‌‌ల్లోని 'మెటా ఏఐ' చాట్‌‌బాట్‌‌లో ఒక కీలకమైన మార్పును తీసుకువస్తోంది. ఇకపై టీనేజర్లు తమ ఏఐ చాట్‌‌బాట్‌‌తో సూసైడ్ లేదా తమకు తాము హాని కలిగించుకునే విషయాల గురించి మాట్లాడితే.. ఆ సమాచారం వెంటనే వారి తల్లిదండ్రులకు అలర్ట్ రూపంలో అందుతుంది. 

యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. వారిని ఆపద నుంచి కాపాడాలనే ఉద్దేశంతో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఇన్‌‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెటా ఏఐ సేఫ్టీ ఫీచర్ ఫర్ టీన్స్ అనే ఫీచర్‌‌ను మెటా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది.

ముందుగా మెటా నిపుణుల పరిశీలన

సేఫ్టీ ఫీచర్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా మెటా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏదైనా చాట్ ఆత్మహత్యకు సంబంధించినట్లు ఏఐ గుర్తిస్తే.. అది నేరుగా తల్లిదండ్రులకు సమాచారం పంపదు. ముందుగా మెటా బృందంలోని నిపుణులు చాట్‌‌ను పూర్తిగా పరిశీలిస్తారు. ఒకవేళ టీనేజర్ ఉద్దేశం స్పష్టంగా లేకపోయినా, ప్రాణాపాయం ఉంటుందనే అనుమానం కలిగితే మెటా ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల చాటింగ్ సారాంశాన్ని తెలుసుకోవడం ద్వారా వారిని సకాలంలో కాపాడుకునే అవకాశం ఉంటుంది.

ఇకపై అసభ్యకర చాటింగ్‎కు చెక్

సూసైడ్ చాటింగ్ గురించి కేవలం తల్లిదండ్రులకు అలర్ట్ పంపడమే కాకుండా.. మెటా తన ఏఐ చాట్‌‌బాట్‌‌ని మరింత సురక్షితంగా మారుస్తోంది. టీనేజర్లతో మద్యం, శృంగారం లేదా అసభ్యకరమైన అంశాల గురించి ఏఐ మాట్లాడకుండా కఠినమైన ఆంక్షలు విధించింది. అంతేకాకుండా.. ఎవరైనా వినియోగదారుడు ఆత్మహత్య చేసుకోవాలే ఆలోచనతో ఉన్నట్టు అనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీ రెస్పాండర్లకు సమాచారం అందించేలా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.