- కొత్తవి ఐదు, పాతవి రెండు
- బిజినెస్ లిస్ట్‌ను రిలీజ్చేసిన లోక్‌సభ సెక్రటరీ జనరల్
- సభలోకి ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితో ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు జాబితా చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్ఎ) సవరణ బిల్లును ఈ సమావేశాల్లో చర్చించి.. ఆమోదం తెలపనుంది.
ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’ను కూడా ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదాయపన్ను సవరణ బిల్లు (ఆర్డినెన్స్ స్థానంలో), సుప్రీంకోర్టు (న్యాయమూర్తులు సంఖ్య) సవరణ బిల్లు (ఆర్డినెన్స్ స్థానంలో), జనన, మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే (సవరణ) బిల్లు, సూక్ష్మ, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు వంటి కొత్త బిల్లులను కూడా ఈ సమావేశాల్లో తీసుకురానుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేపట్టనుంది. జనన, మరణాల ఆలస్యం రిజిస్ట్రేషన్ల నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టానికి మరికొన్ని సవరణలు చేయనుంది. ఎంఎస్ఎంఈ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆలస్యపు చెల్లింపుల పరిష్కారం కోసం సవరణలు చేయనుంది. రాష్ట్రాలు సొంతంగా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనుంది. ఆగస్ట్ 13తో ఈ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
ఎంపీలకు కొత్త మార్గదర్శకాలు
సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడడంతో పాటు పార్లమెంటు అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలపై సచివాలయం పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది. సభా రికార్డులకు భిన్నంగా రహస్యంగా చిత్రాలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వంటి చర్యలకు ఆస్కారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సభలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరా వంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లనూ అనుమతించరు. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలు చేపట్టడంపై పూర్తి నిషేధం విధించారు. సభా సమయాన్ని, వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు తీసుకురావడం వంటి చర్యలను పూర్తిగా నిరాకరించారు. పార్లమెంటు పరిధిలో మతపరమైన కార్యక్రమాలు, పూజలు నిర్వహించకూడదని, సభా మర్యాదలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఎంపిలందరూ సహకరించాలని లోక్‌సభ సచివాలయం కోరింది.
