వెలుగు ఓపెన్ పేజీ : ఆషాఢ బోనాల జాతర సందడి.. ప్రకృతి ఆరాధనే బోనాలు

వెలుగు ఓపెన్ పేజీ :  ఆషాఢ బోనాల జాతర సందడి.. ప్రకృతి ఆరాధనే బోనాలు

చారిత్రాత్మక  హైదరాబాద్‌‌లో  ఆషాఢ  మాసం  బోనాల  సందడి  ప్రారంభమైంది.  పట్నంలో జరుపుకునే  బోనాల జాతర వెనుక  ప్రజల విశ్వాసంతోపాటు శాస్త్రీయమైన అంశాలు కూడా ఉన్నాయి.   వర్ష రుతువు  కాలంలోని  వాతావరణంలో జరిగే మార్పులతో తలెత్తే ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం కోసం సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీ.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో  ఘనంగా నిర్వహించుకునే బోనాల జాతరలో  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి.  తెలంగాణ ఏర్పడిన అనంతరం బోనాల జాతరను  రాష్ట్ర పండుగగా  ప్రకటించడంతో  దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.   

నగరంలో బోనాల జాతర నిర్వహణకు అనేక చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.  హైదరాబాద్,  సికింద్రాబాద్  జంట నగరాల్లో  రెండు వందల ఏండ్ల కిందటే బోనాల జాతర ప్రారంభమైంది. 1813లో నగరంలో  కల‌‌రా మహమ్మారి  ప్రబలినప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నవేళ రక్షించాలని  స్థానిక మిలటరీ అధికారి మధ్యప్రదేశ్‌‌లోని ఉజ్జయిని అమ్మవారిని వేడుకొని  సికింద్రాబాద్‌‌లో  దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి  నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి లష్కర్ బోనాల పేరిట మొక్కులు తీర్చుకుంటున్నారు. 1908 సెప్టెంబర్‌‌లో మూసీ నదికి వచ్చిన వరదలతో నగరం  అతలాకుతలమైంది.  ఈ సమయంలో స్థానిక ప్రజలు లాల్‌‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని  ప్రార్థించి  రక్షించాలని కోరుకొని మొక్కులు తీర్చుకున్నారు.  నాటినుంచి ప్రతియేటా పాతబస్తీ పరిధిలో ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నారు.  సికింద్రాబాద్, లాల్‌‌దర్వాజ బోనాలతోపాటు గోల్కొండ బోనాల జాతరకు కూడా ప్రాధాన్యత ఉంది. కాకతీయుల కాలం నుంచి చరిత్ర ఉన్న గోల్కొండ  జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో నగరంలో ఆషాఢ బోనాల జాతర ప్రారంభమవుతాయి. 

3 వేలకు పైగా అమ్మవారి దేవాలయాల్లో ఘనంగా బోనాలు

ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం  లేదా  ఆదివారం గోల్కొండలో అమ్మవారికి  బోనాలు సమర్పించి  నగరంలో  జాతరకు  నాంది  పలుకుతారు. ఇక్కడ నెల మొత్తం ప్రతి గురువారం, ఆదివారాల్లో  ఘనంగా జాతర నిర్వహిస్తారు.  సికింద్రాబాద్ ఉజ్జయిని దేవాలయంలో ఆషాఢం తొలి ఆదివారం ప్రారంభమయ్యే  బోనాలు  పదిహేను రోజులు నిర్వహించి మూడో  సోమవారం 
పూర్తవుతాయి.  అనంతరం పాతబస్తీలో మూడో ఆదివారంలో ప్రారంభమయ్యే బోనాల జాతర నాలుగో  సోమవారంతో ముగుస్తాయి.  వీటితోపాటు ప్రముఖ బల్కంపేట దేవాలయంతో సహా నగరం వ్యాప్తంగా 3 వేలకు పైగా అమ్మవారి దేవాలయాల్లో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు.  ఆషాఢ మాసం జాతర అనగానే అమ్మవారి ఘటాలకు ఘన స్వాగతం, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు ఆర్పించడం, తొట్టెల సమర్పణ, పలహారపు బండ్ల ఊరేగింపు, భవిష్యవాణి రంగం కార్యక్రమాల సందడి గుర్తుకొస్తాయి.  

ప్రకృతి అంశాలతో ముడిపడిన బోనాల జాతర

బోనాల జాతర  పలు ప్రకృతి అంశాలతో  ముడిపడి ఉంది.  వాతావరణ  మార్పులతో వచ్చే కలరా,  మశూచి,  మలేరియా వంటి వ్యాధులను  అరికట్టాలని అమ్మవారిని  వేడుకోవడంతోపాటు మంచి వర్షాలు పడాలని, పంటలు సమృద్దిగా  పండాలని కోరుకుంటూ అమ్మవారికి సద్ది నైవేద్యంతో బోనాలు సమర్పిస్తారు.  మరోవైపు దీని వెనుక  చారిత్రాత్మక ఘటనలూ ఉన్నాయి.  కుతుబ్‌‌షాహీల కాలంలో  మంత్రులు అక్కన్న, మాదన్నలు   గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం సమర్పించేవారని చరిత్ర ఉంది. అక్కన్న  మాదన్నల  పేరుతో  పాతబస్తీలో అమ్మవారి ఆలయం ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు పెద్దపీట వేస్తూ  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల జీవన విధానం,  సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు రూ.20 కోట్లు కేటాయించింది.  ఈ నిధులతో  జాతర నిర్వహించే మూడు వేలకుపైగా  దేవాలయాల్లో  పలు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.  


- ఐ.వి.మురళీకృష్ణ శర్మ
జర్నలిస్ట్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.