సుప్రీంకోర్టు జులై 13, 2026న తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన సంపూర్ణ నిషేధ ఉత్తర్వులపై స్టే విధించడం ద్వారా... రాజ్యాంగంలోని రెండు కీలక అంశాల మధ్య సమతుల్యతను మరోసారి గుర్తు చేసింది. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ సంబంధాలకు సంబంధించినది ఈ ముఖ్యమైన కేసు. తొలుత మద్రాస్ హైకోర్టు తమిళనాడు అంతటా గోవధపై సంపూర్ణ నిషేధం విధించింది. దీనికి ఆధారంగా ఆర్టికల్ 48ను పేర్కొంది. కానీ ఈ ఉత్తర్వు 1958 తమిళనాడు జంతు సంరక్షణ చట్టం ఫ్రేమ్‌వర్క్‌కు విరుద్ధంగా ఉందని, ఇది న్యాయవ్యవస్థ చట్ట నిర్మాణం అని పేర్కొంటూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఆర్టికల్ 48 -ప్రాథమిక విధులు.. రాష్ట్రాలు వ్యవసాయం, పశు సంవర్ధనను ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, ఆవులు, దూడలు, పాలిచ్చే, వ్యవసాయానికి వినియోగించే పశువుల వధను నిషేధించాలని నిర్దేశిస్తుంది. ఇవి అమలు చేయలేని మార్గదర్శక సూత్రాలు మాత్రమే. ఆర్టికల్ 19(1)(జీ).. ఏ వృత్తి అయినా, వ్యాపారమైనా చేసుకునే ప్రాథమిక హక్కు. వధ, మాంసం వ్యాపారం దీని పరిధిలోకి వస్తాయి. ఆర్టికల్ 25.. మతపరమైన ఆచారాల స్వేచ్ఛ. కొన్ని వర్గాలకు గోమాంసం ఆహారంగా, బలి ఆచారంగా ఉంటుంది. ప్రాథమిక విధులని అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదు. రెండింటి మధ్య సమన్వయం అవసరం.
సంబంధిత చట్టాలు, ముఖ్య తీర్పులు
గోవధ చట్టాలు ‘ప్రవేశం 15 -రాష్ట్ర జాబితా, 7వ షెడ్యూల్’ కింద రాష్ట్రాల ప్రత్యేక అధికారం. కేంద్రం జోక్యం చేసుకోలేదు. మహమ్మద్ హనీఫ్ కృషి వర్సెస్ బిహార్ స్టేట్ 1958. ఈ కేసులో ఆర్థిక ప్రయోజనమున్న ‘ఉపయోగకరమైన పశువుల’ వధను నిషేధించవచ్చు. కానీ వృద్ధ, ఉపయోగంలేని పశువుల వధపై సంపూర్ణ నిషేధం ఆర్టికల్ 19(1)(జీ)ని ఉల్లంఘిస్తుందని న్యాయస్థానం తీర్పునిచ్చింది. స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ మీర్జాపూర్ మొటి కృషి 2005.. ఈ కేసులో పశు సంరక్షణను కేవలం ఆర్థిక కోణం నుంచే కాకుండా సాంస్కృతిక, పర్యావరణ కోణం నుంచి కూడా చూడాలని, సంపూర్ణ నిషేధం చెల్లుబాటు అవుతుందని కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ప్రస్తుతం భారతదేశంలో 3 రకాల చట్టాలు ఉన్నాయి.
1. సంపూర్ణ నిషేధం, 2. పరిమిత నిషేధం, 3.లైసెన్సుతో కూడిన వధ. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే ప్రాముఖ్యతను సంతరించుకుంది. హైకోర్టు చట్టం ఉన్నప్పటికీ కొత్త నిషేధం విధించడం ద్వారా న్యాయవ్యవస్థ, శాసనసభ పాత్రలను దాటిందని సుప్రీంకోర్టు భావించింది. ఫెడరల్ నిర్మాణంలో రాష్ట్ర చట్టాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. గోవధ విషయం కేవలం మతం లేదా ఆహారం గురించి మాత్రమే కాదు. ఇది ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర హక్కులకు సంబంధించినది. ఆర్టికల్ 48 ఆకాంక్షను నెరవేరుస్తూనే, ఆర్టికల్ 19, 25లను కాపాడే చట్టబద్ధమైన, సమతుల్య విధానమే ముందుకు వెళ్లే మార్గంగా పరిగణించాలి.
- ఇరికి మహేష్
న్యాయవాది,
డా. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
