తెలంగాణ స్కిల్ మోడల్‌ కు ఇరాన్ ఫిదా

తెలంగాణ స్కిల్ మోడల్‌ కు ఇరాన్ ఫిదా
  • యువతకు నైపుణ్యాల పెంపుపై ప్రశంసల జల్లు
  • నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో తెలంగాణతో చేతులు కలిపేందుకు రెడీ
  • ఇరాన్ మంత్రి అహ్మద్ మైదారితో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నత స్థాయి భేటీ
  • ఇరాన్ అభివృద్ధిలో భాగస్వాములు కానున్న తెలంగాణ యువత: మంత్రి వివేక్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ మోడల్, విదేశీ ఉపాధి కార్యక్రమాలు, సంక్షేమ విధానాలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి కనబరిచింది. తెలంగాణ యువత నైపుణ్యాలను, ఇక్కడి శిక్షణ విధానాలను ఇరాన్ బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది. భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ, సంస్థాగత భాగస్వామ్యాలపై రెండు ప్రాంతాల మధ్య సహకార అవకాశాలను మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.

గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ) మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఇరాన్ కార్మిక, సహకార, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అహ్మద్ మైదారి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరాన్ సహకార, కార్మిక శాఖ ఉపమంత్రి డాక్టర్ సర్ఫీ, భారతదేశంలోని ఇరాన్ రాయబారి డాక్టర్ ఫత్ అలీ, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ అహ్మదియే, వైస్ కాన్సుల్ మొహ్సెన్ మొఘద్దామి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు అనుసంధానమైన శిక్షణ విధానం, విదేశీ ఉపాధి అవకాశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ అత్యాధునిక నైపుణ్య శిక్షణ పొందుతున్న తెలంగాణ యువత, భవిష్యత్తులో ఇరాన్ అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా నిలుస్తారని చెప్పారు. భారత్ - ఇరాన్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, వాణిజ్య, చారిత్రక సంబంధాలు భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లు, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్ కాం) ద్వారా తెలంగాణ.. దేశంలోనే ఆదర్శవంతమైన స్కిల్ డెవలప్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించిందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందిస్తూ ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో శిక్షణ పొందిన యువత ఇప్పటికే జర్మనీ, జపాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని, అదే తరహాలో భవిష్యత్తులో ఇరాన్‌కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరును కూడా తెలంగాణ అందించగలదనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ - ఇరాన్ మధ్య పరస్పర సహకారం మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక చట్టం పనితీరును, దాంతో కార్మికులకు చేకూరుతున్న లబ్ధిని ఈ సందర్భంగా ఇరాన్ ప్రతినిధి బృందానికి మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు.