- అమ్మాయిల ఫొటోలు, ప్రొఫైల్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు
- కవ్వింపు చాటింగ్‌తో న్యూడ్ వీడియోస్, ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పవన్‌కుమార్ అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు, పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచి.. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా 13 ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లతో వెయ్యి మందికి వల విసిరాడు. కవ్వింపు చాటింగ్‌తో వలలోకి లాగాడు. పర్సనల్, న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశాడు. 82 మందిని బెదిరించి దాదాపు రూ.25లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన కొండబత్తుల పవన్ కుమార్ (23)ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు.
ఫేక్ ప్రొఫైళ్లతో.. హనీట్రాప్
సోమవారం చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. పవన్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చదువుతూ మధ్యలోనే మానేశాడు. ప్రస్తుతం కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. గతంలో బషీర్‌బాగ్‌లోని డిజీ లోన్స్ అనే సంస్థలో పనిచేశాడు. అక్కడ రూ.16 వేల జీతం అడ్వాన్స్ తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే పవన్.. ఆన్‌లైన్‌లో అమ్మాయిల ఫొటోలు సేకరించి నకిలీ ఖాతాలు తెరిచేవాడు. వాటి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. స్పందించిన వారితో వయసుకు తగ్గట్టుగా చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకునేవాడు. కోల్‌కతాకు చెందిన ఓ యువతి ఫొటోలతో ‘చందనా’ పేరుతో ఖాతా తెరిచి పలువురిని ట్రాప్ చేశాడు.
స్నేహితుడినీ వదల్లేదు
పవన్ వలలో చిక్కిన 82 మందిలో వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందినవారున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌కు చెందిన 24 మందిని, దుబాయ్, టర్కీ, పాకిస్తాన్, కెనడాకు చెందిన మరో తొమ్మిది మందిని పోలీసులు గుర్తించారు. బాధితుల్లో డాక్టర్లు, లెక్చరర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు ఉన్నారు. తన డిప్లొమా స్నేహితుడిని కూడా హనీట్రాప్‌లోకి దించి రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో రూ.7 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి నుంచి రూ.6.8 లక్షలు, రూ.7 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. బాధితుల ఫొటోల ఆధారంగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు ఉపయోగించిన 13 ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేస్‌బుక్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అమ్మాయి అన్నను అంటూ బెదిరింపులు
బాధితుల బలహీనతలను గుర్తించి చాటింగ్‌ను లైంగిక సంభాషణల వైపు మళ్లించేవాడు. వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు కూడా పంపేవాడు. బాధితులు పంపిన ఫొటోలు, వీడియోలను వేర్వేరు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాల్లో భద్రపరిచేవాడు. ఆ తర్వాత చాటింగ్ చేసిన యువతి సోదరుడిగా పరిచయం చేసుకునేవాడు. ఫొటోలు బయటపెడతానని, తన సోదరి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయిస్తానని బెదిరించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే బాధితుల సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలను ట్యాగ్ చేస్తానని హెచ్చరించేవాడు. ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా డబ్బుల కోసం ఒత్తిడి చేసేవాడు. కొందరు బాధితులను నేరుగా కూడా కలిసేవాడు.
