- మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో ఘటన
- లాఠీచార్జిని ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల/ దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా పటాకులు కాల్చడంతో ప్రారంభమైన వివాదం కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తాళ్లపేట స్టేజీ వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతుండగా, కాంగ్రెస్ నేత ఆకుల దుర్గాప్రసాద్ వారి సమీపంలో పటాకులు కాల్చడంతో వివాదం మొదలైంది. వారించిన సర్పంచ్ కుర్సింగ కళావతితో పాటు మహిళలపై దురుసుగా ప్రవర్తించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
సమాచారం అందుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం ఎస్సైలు రాజవర్ధన్, సురేశ్, ఉదయకిరణ్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో సర్పంచ్ కళావతిపై సీఐ దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంచిర్యాల-, నిర్మల్ మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతన జగన్‌మోహన్‌రావు, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొట్నాక తిరుపతి బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
లాఠీచార్జికి కారణమైన వారు, సీఐ రమణమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు మద్దతు తెలిపిన నాయకులు డీసీపీ భాస్కర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
దాడిని ఖండించిన ఎంపీ వంశీకృష్ణ..
తాళ్లపేటలో ఆదివాసీ గిరిజన సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ తిరుపతిపై పోలీసులు దాడి చేయడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన పోలీసు ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తాళ్లపేటలో పోలీసు పికెటింగ్..
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోమవారం తాళ్లపేట, మ్యాదరిపేటలో సాయుధ పోలీసులతో పికెటింగ్ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్‌ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ దండేపల్లి పీఎస్‌ను సందర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరువర్గాల నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉండగా, ఈ గొడవకు కారణమైన దుర్గాప్రసాద్ గతంలో గూడెం గ్రామంలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై దాడి చేయగా, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు అందుకున్నారు.
