నేడు (జూలై 17)  ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ

నేడు (జూలై 17)  ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ

 

  • కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి , మంత్రి దామోదర  
  • బేసిక్ పే, పెన్షన్ నుంచి 1.5 శాతం కంట్రిబ్యూషన్‌ జీవో విడుదల

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హెల్త్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. శుక్రవారం సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్‌ ను డిప్యూటీ సీఎం లాంచ్ చేయనున్నారు. కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు, వివిధ శాఖల కార్యదర్శులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. 

బేసిక్ పే నుంచి 1.5 శాతం మినహాయింపు..

ఈ పథకం అమలు కోసం ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుంచి 1.5 శాతం కంట్రిబ్యూషన్ మినహాయించి, ఈహెచ్ఎస్ ఫండ్‌ కు జమ చేసేందుకు జీవో నంబర్ 50ని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గురువారం జారీ చేశారు. గతంలో విడుదల చేసిన జీవో నంబర్ 40 ప్రకారం ఈ 1.5 శాతం నిధుల మినహాయింపు అమల్లోకి రానుంది.

ఈహెచ్‌సీటీ బోర్డు పునర్వ్యవస్థీకరణ..

ఈహెచ్ఎస్ స్కీమ్ పర్యవేక్షించేందుకు వీలుగా ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడిన ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (ఈహెచ్​సీటీ) బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ ను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ పథకం అమలు, నిర్వహణ, పర్యవేక్షణ పూర్తి బాధ్యతలు ఇకపై బోర్డుకే ఉంటాయి. ఈ నిధులను కేవలం ట్రస్ట్ డీడ్, నిర్దేశిత నియమ నిబంధనలకు లోబడి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల (డిపెండెంట్ల) వైద్య అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.