హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో ఇకపై పాలాభిషేకాలు, గజమాలలపై నిషేధం విధిస్తు న్నామని పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. కార్యకర్తలు నాయకులకు పాలాభిషేకాలు, జలాభిషేకాల్లాంటివి చేయొద్దని, గజమాలలు వేయొద్దని ఆదేశించారు. ఈ మేరకు ఆమె పేరుతో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆహార పదార్థాలను వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని అందులో ఆమె స్పష్టం చేశారు. నాయకులకు అతిపెద్ద పూల దండలు వేసేందుకు జేసీబీలు, భారీ క్రేన్‌లు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలు వినియోగించొద్దని, ఆ వాహనాలు అణచివేతకు చిహ్నాలని ఆమె పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశి క్షణ చర్యలు తప్పవని మీనాక్షి హెచ్చరించారు.
