ములుగు, వెలుగు: వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం కన్నవారిని కొడుకులు పట్టించుకోకపోతే చర్యలు తప్పవని ఆర్డీవో కె.కృష్ణవేణి హెచ్చరించారు. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గాదె నక్షత్రారెడ్డి, జేసింతమ్మ తమ కొడుకులు అశోక్ రెడ్డి, అబ్రహం రెడ్డి పట్టించుకోవడంలేదని, తాము సంపాదించిన ఆరు గుంటల స్థలాన్ని ఇరువురికి సమానంగా పంపిణీ చేసినా ఇబ్బంది పెడుతున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
జూన్ 30న చేపట్టిన విచారణలో కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి విషయంలో కొడుకులు జోక్యం చేసుకోరాదని ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్డీవో తెలిపారు.
