మెస్సీకి స్పెషల్ ఫైనల్.. తన ఫుట్‌బాల్ జర్నీకి దారి చూపించిన స్పెయిన్‌తోనే ఢీ!

మెస్సీకి స్పెషల్ ఫైనల్.. తన ఫుట్‌బాల్ జర్నీకి దారి చూపించిన స్పెయిన్‌తోనే ఢీ!

FIFA World Cup 2026 Final: జులై 19న (ఆదివారం) జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు.. అల్టిమేట్ ఎమోషనల్ డ్రామాకు వేదిక అయింది. ఒకవైపు గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్, గోట్ (GOAT) లియోనెల్ మెస్సీ.. మరోవైపు అతనిని దైవంగా భావించే స్పెయిన్ యువ సంచలనాలు. స్పెయిన్‌తో ఫైనల్ ఫైట్ గురించి అడిగినప్పుడు మెస్సీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. నేను వారిలో చాలా మందిని ఎదుర్కొన్నాను, ఇప్పటికీ ఫాలో అవుతున్నాను.. ముఖ్యంగా నేను ఎంతగానో ప్రేమించే బార్సిలోనా క్లబ్ తరపున ఆడే ప్లేయర్స్ అందులో ఉన్నారంటూ మెస్సీ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. 

నా రక్తం అర్జెంటీనాదే.. స్పెయిన్ సిటిజన్‌షిప్: 
లియోనెల్ మెస్సీ కెరీర్ ప్రారంభంలోనే అతనికి తమ దేశం తరపున ఆడేలా ఆఫర్ ఇవ్వాలని స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తీవ్రంగా ప్రయత్నించింది. 12 ఏళ్ల ప్రాయంలోనే అర్జెంటీనాలోని రోసారియోను వదిలి బార్సిలోనాలో స్థిరపడిన మెస్సీకి స్పెయిన్ పౌరసత్వం (Citizenship) కూడా ఉంది. స్పెయిన్‌లో ఇల్లు, స్థలాలు ఉండి అక్కడి ఆటగాళ్లతో సమానంగా బతికినా, మెస్సీ తన అర్జెంటీనా యాక్సెంట్ (భాషా శైలి)ను ఎప్పుడూ వదులుకోలేదు. నాకు స్పెయిన్ యాక్సెంట్ ఎందుకు లేదని చాలా మంది అడుగుతారు. నా మాతృదేశంతో ఉన్న గుర్తింపును కోల్పోవడం నాకు ఇష్టం లేదు.. అందుకే స్పెయిన్ తరపున ఆడాలని ఇన్‌ఫార్మల్ కాంటాక్ట్స్ వచ్చినా.. నేను ఎల్లప్పుడూ అర్జెంటీనా జెర్సీనే ధరించాలని కోరుకున్నాను అని మెస్సీ స్పష్టం చేశాడు.

స్పెయిన్ ఫ్యాన్ బాయ్స్ వర్సెస్ మెస్సీ:  
ప్రస్తుత స్పెయిన్ జట్టులోని మెజారిటీ ఆటగాళ్లకు మెస్సీ ఒక దేవుడు. చిన్నప్పటి నుంచి అతనిని చూస్తూ పెరిగిన వీరికి, ఇప్పుడు అదే మెస్సీని ఫైనల్లో ఢీకొట్టడం ఒక కల నిజమైంది. స్పెయిన్ నెక్స్ట్-జెన్ (Next-Gen) సంచలనం లామిన్ యమల్ కేవలం రెండు నెలల బాబుగా ఉన్నప్పుడు, ఒక యాడ్ షూట్ కోసం మెస్సీ అతనిని ఎత్తుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పెయిన్ స్టార్ డాని ఓల్మో బెడ్‌రూమ్‌లో ఇప్పటికీ మెస్సీతో దిగిన ఫోటో వేలాడుతోంది. మికెల్ ఒయార్జబల్ ఇప్పటికీ మెస్సీ వీడియోలు చూస్తూ ఫుట్‌బాల్ నేర్చుకుంటానని ఓపెన్‌గా చెప్తాడు. కానీ, ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్‌లో ఈ ఫ్యాన్ బాయ్స్ (Fanboys) అందరూ తమ ఆరాధ్య దైవాన్ని ఆడ్డుకోవాల్సిందే. మెస్సీ వరుసగా రెండోసారి వరల్డ్ కప్ అందుకోకుండా ప్రయత్నిస్తారు. పైగా, అర్జెంటీనా జట్టులోని ఆరుగురు ప్లేయర్స్ స్పెయిన్ లీగ్ (La Liga) లోనే ఆడుతుండటంతో, వారం రోజుల తర్వాత మళ్లీ క్లబ్స్ తరపున వీరంతా సహచరులు కానున్నారు. 

గురు-శిష్యుల మైండ్ గేమ్స్: 
ఈ మ్యాచ్ కేవలం ఆటగాళ్ల మధ్యే కాదు, ఇద్దరు కూల్ మేనేజర్ల మధ్య కూడా రసవత్తరంగా సాగనుంది. అర్జెంటీనా బాస్ లియోనెల్ సకలోని స్పెయిన్‌లో దాదాపు దశాబ్దం పాటు ప్లేయర్‌గా గడిపాడు. విశేషమేమిటంటే, అతను కోచింగ్ నేర్చుకున్నది ప్రస్తుత స్పెయిన్ కోచ్ లుయిస్ డి లా ఫ్యూయెంటె ఆధ్వర్యంలోనే. లా రోజాస్ లో మేము కోచింగ్ కోర్సు చేస్తున్నప్పుడు లుయిస్ మాకు ఎంతో సహాయం చేశాడు. అతని మేనేజ్‌మెంట్ స్టైల్, ఆటగాళ్లను నడిపించే విధానం నాకు చాలా ఇష్టం అని సకలోని తన గురువుపై ప్రశంసలు కురిపించాడు. ఒకప్పుడు లెజెండ్ డియెగో మారడోనా సైతం సకలోనిని చూసి.. మంచి అబ్బాయే, కానీ కనీసం ఒక ట్రాఫిక్‌ను కూడా కంట్రోల్ చేయలేడని విమర్శించాడు. అటు స్పెయిన్ కోచ్ లుయిస్‌ను కూడా తక్కువ బడ్జెట్ కోచ్ అని తక్కువంచనా వేశారు. కానీ ఈ ఇద్దరూ ఇప్పుడు తమ దేశాలను వరల్డ్ కప్ ఫైనల్ స్టేజీకి చేర్చి సత్తా చాటారు.

స్పెయిన్ పర్‌ఫెక్షన్ వర్సెస్ అర్జెంటీనా రూత్‌లెస్ కమ్‌బ్యాక్: 
టెక్నికల్‌గా చూస్తే ప్రస్తుత టోర్నీలో స్పెయిన్ ఒక పర్ఫెక్ట్ (Perfect) సింఫనీ లా ఆడుతోంది. ఫ్రాన్స్ క్వీన్ కిలియన్ ఎంబాపె వంటి పవర్‌ఫుల్ ఫార్వర్డ్స్‌ను కూడా స్టార్వ్ (Starve) చేసి పక్కనబెట్టేంత స్ట్రాంగ్ డిఫెన్స్ స్పెయిన్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే వారి డిఫెన్స్ లైన్ బద్దలైంది.

స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా ఫైనల్ ఫైట్:  
మరోవైపు అర్జెంటీనా ప్రతి నాకౌట్ మ్యాచ్‌లోనూ చావు అంచుల దాకా వెళ్లి బతికి బయటపడింది. స్పెయిన్ తరహా పర్‌ఫెక్షన్ లేకపోయినా.. మ్యాచ్ ముగిసే విజిల్ పడేవరకు ప్రాణాలు పణంగా పెట్టి ఆడే రూత్‌లెస్ (Ruthless) కమ్‌బ్యాక్ మెంటాలిటీ అర్జెంటీనా సొంతం. సకలోని చెప్పినట్లు.. మా జట్టు ప్రత్యర్థి కష్టాల్లో ఉన్నప్పుడు రక్తం వాసన పసిగట్టి వేటాడే పులి లాంటిది అని చెప్పుకొచ్చాడు.  ఆదివారం రాత్రి జరగబోయే ఈ మహా సంగ్రామంలో.. స్పెయిన్ తన ఆరాధ్య దైవమైన మెస్సీ కన్నీళ్లు పెట్టాలని కోరుకుంటుంది.. అటు మెస్సీ కూడా తన సెకండ్ హోమ్ అయిన స్పెయిన్ గుండెల్ని పగలగొట్టడానికైనా ఏమాత్రం వెనకాడటం లేదు.