ఫ్రీ UPI చెల్లింపులకు కాలం చెల్లుతోందా..? రూ.2వేలు దాటిన పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్స్

ఫ్రీ UPI చెల్లింపులకు కాలం చెల్లుతోందా..? రూ.2వేలు దాటిన పేమెంట్స్‌పై ఛార్జీలకు ప్లాన్స్

యూపీఐ చెల్లింపులపై ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. అయితే ఇప్పుడు యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద వ్యాపార సంస్థలకు జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై వచ్చే రెండు వారాల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మోడీ సర్కార్ ప్రతిపాదన ప్రకారం రూ.2వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఈ ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంది. అలాగే ఈ ఛార్జీ గరిష్ఠంగా 0.5 శాతం కంటే తక్కువగా ఉండేలా నిర్ణయించే అవకాశముందట. ఈ ఛార్జీని వినియోగదారుల నుంచి వసూలు చేయబోరని, కేవలం పెద్ద వ్యాపారులు, సంస్థలపైనే వర్తింపజేయాలనే ఆలోచన ఉందని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. దీంతో సాధారణ ప్రజలు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ లేకపోవడంతో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు మొత్తం మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చును భరిస్తున్నారు. యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతున్న కొద్దీ సర్వర్లు, భద్రతా వ్యవస్థలు, సాంకేతిక నిర్వహణ, కొత్త టెక్నాలజీ అభివృద్ధికి అయ్యే వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చెల్లింపుల వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే ఆదాయ వనరు అవసరమనే అభిప్రాయం ప్రభుత్వంలోనూ కలిగింది.

ఇప్పటికే రూ.2వేల వరకు జరిగే చిన్న విలువ గల యూపీఐ లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థ భాగస్వాములకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయినప్పటికీ.. పార్లమెంట్ స్థాయి ఆర్థిక సంఘం ఇటీవల సమర్పించిన నివేదికలో జీరో ఎండీఆర్ విధానం వల్ల యూపీఐ వ్యవస్థ ఆర్థికంగా స్థిరంగా కొనసాగడం కష్టమవుతోందని పేర్కొంది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో యూపీఐ వినియోగదారుల సంఖ్య మరో 60 కోట్లకు చేరుకుని.. నెలకు 100 నుంచి 150 బిలియన్ లావాదేవీలు జరిగే అవకాశముందని అంచనా వేసింది. అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, కొత్త వ్యాపారుల అనుసంధానానికి భారీ పెట్టుబడులు అవసరమని.. అందుకే ఎండీఆర్ వంటి విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.