110 ఏళ్ల చరిత్ర ఉన్న పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేశారు..?

 110 ఏళ్ల చరిత్ర ఉన్న పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేశారు..?

ముంబైలో ఎంతో పేరుపొందిన, దాదాపు 110 ఏళ్ల చరిత్ర ఉన్న 'పార్శీ డెయిరీ ఫామ్'కు ఫుడ్ అండ్  డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గట్టి షాక్ ఇచ్చింది. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల్లో తీవ్రమైన లోపాలు ఉండటంతో మెరైన్ లైన్స్‌లో ఉన్న ఈ డెయిరీ ఫామ్ లైసెన్స్‌ను అధికారులు తక్షణమే రద్దు చేశారు.

 ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. జూలై 14న ఆహార భద్రతా అధికారులు ఈ డెయిరీ ఫామ్ లో అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో అక్కడ షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పాలు ప్రాసెస్ చేసే చోట, నిల్వ ఉంచే గదుల గోడలకు విపరీతంగా బూజు పట్టి ఉంది. ఆ బూజు పట్టిన గోడల పక్కనే, ముడి పదార్థాలను నేరుగా నేలపైనే పడేశారు.

డెయిరీ ఫామ్ ఉన్న ప్రదేశంలో ఈగలు, కీటకాలు విపరీతంగా ఉన్నాయి. ఎలుకలు రాకుండా కనీసం నెట్ కూడా ఏర్పాటు చేయలేదు. పచ్చి పాలను సేకరించేందుకు సరైన రక్షణ ఏర్పాట్లు లేవు. అలాగే, వాడుకోగా మిగిలిన మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ (ETP) కూడా అక్కడ లేదు. అక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించిన హెల్త్ రికార్డులు సరిగ్గా లేవు. చాలా ప్రొడక్ట్స్‌పై కనీసం ఎక్స్‌పైరీ డేట్  కూడా ముద్రించలేదు.

ఈ లోపాల వల్ల పాలు, ఇతర పదార్థాలు పాడైపోయి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు తేల్చారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు  జూలై 15 నుండి ఈ డెయిరీలో ఎలాంటి పదార్థాలను తయారు చేయడం, అమ్మడం లేదా సప్లయ్  చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.

 రూ. 32 లక్షల సరుకు సీజ్!
ఈ తనిఖీలు అంతటితో ఆపకుండా.. జూలై 16న పాల్ఘర్‌లో ఉన్న ఈ డెయిరీ ఫామ్ మరో బ్రాంచ్‌పై కూడా అధికారులు దాడి చేశారు. అక్కడ క్వాలిటీ సరిగ్గా లేదనే అనుమానంతో.. దాదాపు 6 వేల కిలోల ఆవు వెన్న, పనీర్, లేబుల్ లేని జున్ను పాలు, ఇలా మొత్తం రూ. 32 లక్షల విలువైన సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కుల్ఫీ, నెయ్యి, కోవా వంటి ఎనిమిది రకాల శాంపిళ్లను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు.

ఒకే ఒక్క పాల డబ్బాతో మొదలై..
ఈ డెయిరీ ఫామ్ కి ఒక పెద్ద చరిత్రే ఉంది. 1916లో నరిమాన్ అర్దేశిర్ అనే 18 ఏళ్ల యువకుడు ఒకే ఒక్క పాల డబ్బాతో దీనిని మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ కుటుంబానికి చెందిన నాల్గవ తరం వారు (పర్వానా మిస్త్రీ, జీనియా పటేల్, సర్ఫరాజ్, బఖ్త్యార్) దీనిని నడిపిస్తున్నారు. ఇప్పుడు వీరికి 300 ఎకరాల సొంత ఫామ్ ల్యాండ్ ఉంది. సాంప్రదాయ పద్ధతిలోనే చేత్తో చిలికిన వెన్న, నెయ్యి, స్వీట్లు అమ్ముతామని వీరు ఎప్పుడూ చెబుతుంటారు. 2023లో కొత్త లుక్‌తో రీబ్రాండింగ్ కూడా చేశారు. కానీ, ఇప్పుడు నాణ్యత లోపించడంతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

 మహారాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల్లో కల్తీని అరికట్టేందుకు FDA పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి, సుమారు 2,300 లీటర్ల పాలు, కల్తీకి వాడే వంట నూనెలు, 6,800 కిలోల పాల ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 45.78 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.