భారతీయ రైల్వే చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం: దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు

భారతీయ రైల్వే చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం: దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు

చండీగఢ్: భారతీయ రైల్వే చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు రయ్యు రయ్యుమంటూ పట్టాలపై పరుగులు తీసింది. శుక్రవారం (జులై 17) హర్యానా రాష్ట్రంలోని జింద్ రైల్వే స్టేషన్‎లో ప్రధాని మోడీ జెండా ఊపి ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్‎ను ప్రారంభించారు. జింద్, సోనిపట్ మధ్య నడవనున్న ఈ రైలు.. అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ఇది హైడ్రోజన్‎ను ఇంధనంగా వాడుకుని విద్యుత్తును తయారు చేస్తుంది.

ఈ క్రమంలో కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనివల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు తక్కువ శబ్దాన్ని చేస్తూ.. పర్యావరణహితంగా ప్రయాణాన్ని అందిస్తుంది. పది కోచ్‎ల సామర్థ్యం, 3,200 హార్స్ పవర్ శక్తి గల ఈ ఇంజిన్.. హైడ్రోజన్ రైలు రంగంలోనే అత్యంత శక్తిమంతమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఢిల్లీ–కత్రా మధ్య ప్రయాణం 14 గంటల నుంచి 6 గంటలకు తగ్గుదల 

ప్రధాని మోడీ శుక్రవారం హర్యానాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభంతో పాటు జింద్‌‌లోని ఏకలవ్య స్టేడియం వేదికగా సుమారు రూ. 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో ప్రధానంగా ఢిల్లీ–అమృతసర్–-కత్రా ఎక్స్‌‌ప్రెస్‌‌వే సహా పలు నేషనల్ హైవే  ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఎక్స్‌‌ప్రెస్‌‌వే అందుబాటులోకి వస్తే ఢిల్లీ-–కత్రా మధ్య ప్రయాణ సమయం 14 గంటల నుంచి కేవలం 6 గంటలకు తగ్గుతుంది. అలాగే, జింద్–గోహనా రహదారి నిర్మాణం వల్ల ప్రయాణ సమయం రెండు గంటల నుంచి 40 నిమిషాలకు పడిపోనుంది. 

కురుక్షేత్రలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని చండీగఢ్, జలంధర్‌‌కు చేరుకుంటారు. అక్కడ వరుసగా రూ. 4,700 కోట్లు, రూ. 5,470 కోట్ల విలువైన మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా భివానిలోని పండిట్ నేకి రామ్ శర్మ మెడికల్ కాలేజీతో సహా పలు వైద్య సంస్థలను జాతికి అంకితం చేస్తారు. అలాగే, కురుక్షేత్రలో సిక్కుల చరిత్రను చాటిచెప్పేలా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక మ్యూజియానికి కూడా ప్రధాని  నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు.