జియో వినియోగదారులకు మరో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.55తో కొత్త JioTV Pro Packను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏకంగా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్ తమ స్మార్ట్‌ఫోన్‌లోనే వీక్షించే అవకాశం పొందనున్నారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులిద్దరూ ఈ రీచార్జ్‌ను చేసుకోవచ్చు. ముఖ్యంగా టీవీ ఛానెల్స్‌ను మొబైల్‌లో చూడాలనుకునే వారికి ఇది తక్కువ ధరలో మంచి ఎంపికగా జియో చెబుతోంది.
ఈ JioTV Pro Packలో 16కు పైగా భాషల్లో ప్రసారమయ్యే 1,000కిపైగా లైవ్ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు 150కు పైగా ప్రీమియం ఛానెల్స్ కూడా వీక్షించవచ్చు. ఎంటర్ టైన్మెంట్, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్, ప్రాంతీయ ఛానెల్స్ వంటి విభిన్న కేటగిరీల కంటెంట్ ఇందులో ఉంటుంది. స్టార్‌ప్లస్ HD, కలర్స్ HD, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ HD, సోనీ SAB HD, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్‌తో పాటు అనేక ప్రాంతీయ ఛానెల్స్ ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే JioStar, Sonyకు చెందిన స్పోర్ట్స్ ఛానెల్స్ మాత్రం ఈ ప్యాక్‌లో ఉండవు.
ఈ ప్లాన్ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులో వాయిస్ కాల్స్, SMSలు లేదా అదనపు డేటా వంటి ప్రయోజనాలు ఉండవు. ఈ సర్వీస్ ఉపయోగించాలంటే వినియోగదారుడికి యాక్టివ్ జియో మొబైల్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. రీచార్జ్ చేసిన వెంటనే అదే జియో నంబర్‌తో JioTV యాప్లో లాగిన్ అయితే ఎలాంటి ప్రత్యేక యాక్టివేషన్ అవసరం లేకుండానే టీవీ ఛానెల్స్‌ను చూడవచ్చు. ఒకేసారి ఒక మొబైల్ డివైస్‌లో మాత్రమే ప్లాన్ సపోర్ట్ చేస్తుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వినియోగదారులు ఈ ప్లాన్‌ను ముందుగానే ఒకటి కంటే ఎక్కువ సార్లు రీచార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రతి రీచార్జ్‌కు సంబంధించిన 30 రోజుల వ్యాలిడిటీ ఆటోమేటిక్‌గా వరుసగా అమలులోకి వస్తుంది. ఈ కొత్త రూ.55 JioTV Pro Pack జియో అధికారిక రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చుతో మొబైల్‌లో లైవ్ టీవీని ఆస్వాదించాలని భావించే జియో వినియోగదారులకు ఈ ప్లాన్ ఆకర్షణీయమైనదే.
