బీట్ రూట్ అనేది ఎన్నో పోషకాలున్న ఓ అద్భుతమైన దుంప కూరగాయ. దీనిని నేరుగా తినాలన్నా.. కూర తినాలన్నా పిల్లలు ఇష్టపడరు. కాని వాటితో వెరైటీ స్నాక్స్ చేసుకుని తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీట్ రూట్ కజ్జికాయలు తింటే సూపర్ గా ఉంటాయి. అలాగే మిక్సిడ్ కూరగాయలతో బిసి బెళె( టమాటాబాత్ మాదిరిది)ను వేడి వేడి అన్నంలో .. చిటికెడు నెయ్యి వేసి పెడితే పిల్లలే కాదు.. పెద్దలు కూడా లొట్టలేయాల్సిందే.. మరి ఇలాంటి టేస్ట్.. ఆరోగ్యకరమైన వంటకాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!
బీట్ రూట్ కర్జెలు( కజ్జికాయలు) తయారీకి కావాల్సినవి
- బీట్ రూట్ తురుము - రెండు కప్పులు
- క్యారెట్ తురుము - ఒక కప్పు
- పచ్చి కొబ్బరి తురుము -రెండు కప్పులు
- మైదా లేదా గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు
- జీడిపప్పు లేదా బాదం పలుకులు -ఒక టేబుల్ స్పూన్
- నెయ్యి -టేబుల్ స్పూన్లు
- నూనె -సరిపడా
- ఇలాచీ పొడి - అర టీ స్పూన్
- చక్కెర పొడి - రెండు కప్పులు
- పాలు - ఒకటిన్నర కప్పు
- తేనె - రెండు టీ స్పూన్లు
బీట్ రూట్ కర్జెలు( కజ్జికాయలు) తయారీ విధానం
మైదా లేదా గోధుమ పిండిలో నెయ్యి, తేనె, పాలు పోసి మెత్తగా కలపాలి. పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు లేదా బాదం తరుగు వేగించి పక్కనబెట్టాలి. ఇంకాస్త నెయ్యి వేడి చేసి బీట్ రూట్, క్యారెట్, కొబ్బరి తురుము ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. తరువాత ఒక వెడల్పాటి ప్లేట్ లో వేయాలి.
ఇలాచీ పొడి, జీడిపప్పు లేదా బాదం తరుగు, చక్కెర పొడి వేసి బాగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీల్లా వత్తాలి. వాటి మధ్యలో తురుము మిశ్రమాన్ని పెట్టి గర్జెల్లా (కజ్జికాయలు) వత్తి నూనెలో ఫ్రై చేయాలి
బిసి బెళె( టమాటా,ఆలుగడ్డ,బీన్స్,క్యారెట్ లతో) బాత్ తయారీకి కావలసినవి
- బియ్యం - ఒక కప్పు
- కంది పప్పు అర కప్పు
- చింతపండు - కొద్దిగా
- ఉల్లిగడ్డ - ఒకటి
- బీన్స్- ఐదు
- క్యారెట్లు - రెండు
- ఆలుగడ్డ -ఒకటి
- పచ్చిబఠాణీలు - పావు కప్పు
- టొమాటో తరుగు - ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు - తగినంత
- నూనె - సరిపడా
- గరం మసాలా -ఒక టీ స్పూన్
- ఎండుకొబ్బరి తురుము - అర కప్పు
- ఆవాలు-అర టీ స్పూన్
- మిరియాలు లేదా మిరియాల పొడి - అర టీ స్పూన్
- మెంతుల పొడి - పావు టీ స్పూన్
- కరివేపాకు - రెండు రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
బిసి బెళె బాత్తయారీ విధానం
బియ్యాన్ని కాస్త మెత్తగా,పప్పును మామూలుగా ఉడికించాలి. పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేగించి, తరిగిన కూరగాయ ముక్కలు, సరిపడా నీళ్లు పోసి సన్నని మంటపై కాస్త మెత్తగా అయ్యే వరకు వేగించాలి.
►ALSO READ | జ్యోతిష్యం :60 డిగ్రీల దూరంలో కుజుడు.. శని... నాలుగు రాశుల వారికి సానుకూల మార్పులు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..!
చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము, మెంతి పొడి, మిరియాల పొడి లేదా మిరియాలు, గరం మసాలా వేసి మరికాసేపు వేగించాలి. తర్వాత ఉడికించిన అన్నం, ముద్ద పప్పు వేసి కలపాలి. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే ఘాటుగా, టేస్టీగా ఉంటుంది.
