"డబ్బు కోసం కాదు.. మీ సైలెన్స్ వల్లే ఉద్యోగం వదిలా".. సీఈఓకు ఉద్యోగిని చెప్పిన మాటలు వైరల్!

"డబ్బు కోసం కాదు.. మీ సైలెన్స్ వల్లే ఉద్యోగం వదిలా".. సీఈఓకు ఉద్యోగిని చెప్పిన మాటలు వైరల్!

ఉద్యోగులు ఎక్కువ జీతం, పెద్ద పొజిషన్ కోసం కంపెనీ మారుతారనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఓ కంపెనీ సీఈఓకు తన సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగిని వెళ్లిపోతూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగేళ్ల పాటు పనిచేసి, 2 సార్లు ప్రమోషన్ పొందిన ఆ ఉద్యోగిని రాజీనామా చేయడంతో సీఈఓ ఎగ్జిట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఎక్కువ జీతం లేదా మంచి ఆఫర్ వచ్చి ఉంటుందని భావించిన ఆయనకు ఊహించని సమాధానం ఎదురయ్యాయి.

ఆ ఉద్యోగిని మాట్లాడుతూ.. "నేను డబ్బు కోసం ఉద్యోగం వదల్లేదు. రెండేళ్లుగా నా పనిభారాన్ని కొంచెం తగ్గించాలని కోరుతున్నాను. ప్రతిసారీ నా అభ్యర్థనను స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని ఆమె చెప్పింది. చివరకు మరో కంపెనీ ఇంటర్వ్యూలో తన అవసరాన్ని గుర్తించి స్పందించడంతో అక్కడ చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆ కంపెనీ సీఈఓ కళ్లు తెరిపించాయి.

►ALSO READ | 2027 నుంచి కొత్త మైలేజ్ నిబంధనలు, ఈవీలు–హైబ్రిడ్ కార్లకు భారీ ప్రోత్సాహం!

ఈ సంఘటన తన ఆలోచననే మార్చేసిందని సీఈఓ అల్పేష్ వఘాసియా లింక్డ్‌ఇన్‌లో రాశారు. ఉద్యోగి కోరిన విషయాన్ని రికార్డులో నమోదు చేయడం మాత్రమే సరిపోదని, దానికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఎవరికో ఉండాలని చెప్పారు. "ఒక అభ్యర్థనను నమోదు చేయడం అంటే దానికి స్పందించినట్టే అనుకోవడం తప్పు. సమాధానం లేని అభ్యర్థన అంటే మర్యాదపూర్వకంగా చెప్పిన 'నో'తో సమానం" అని సీఈఓ పేర్కొన్నారు.

ఈ ఘటన తర్వాత తమ కంపెనీలో విధానాలను పూర్తిగా మార్చినట్లు సీఈఓ చెప్పారు. ఇకపై ఉద్యోగి చేసే ప్రతి అభ్యర్థనకు ఒక బాధ్యుడిని, సమాధానం చెప్పాల్సిన గడువును నిర్ణయించామని చెప్పారు. "అది సాధ్యం కాదని చెప్పినా ఉద్యోగులు అర్థం చేసుకుంటారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడాన్నే వారు ఎక్కువగా భరించలేరు" అని సీఈఓ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు వేలాది మంది స్పందిస్తూ, ఉద్యోగులు కంపెనీలను కాదు.. తమ మాట వినిపించకపోవడాన్నే ఎక్కువగా వదిలి వెళ్తారని అభిప్రాయపడుతున్నారు.