E20 పెట్రోల్‌కు సంబంధించిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. పెట్రోల్ బంక్ ఓనర్స్ కీలక అంశాలను వెల్లడిస్తున్నారు. E20లో ఉండే 20 శాతం ఇథనాల్ స్వభావం వల్లే వర్షాకాలంలో పెట్రోల్ కలుషితమయ్యే ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న భూగర్భ స్టోరేజీ ట్యాంకులు సాధారణ పెట్రోల్ కోసం రూపొందించబడ్డాయని, అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్ స్టోర్ చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేవని వారు చెబుతున్నారు.
ఇథనాల్‌కు నీటితో ఉన్న సంబంధం..
ఇథనాల్‌కు నీటిని సులభంగా గ్రహించే హైగ్రోస్కోపిక్ గుణం ఉంటుంది. వర్షాకాలంలో భూగర్భ ట్యాంకుల్లో వర్షపు నీరు, తేమ, ఘనీభవనం, ట్యాంకర్ల ద్వారా స్వల్పంగా నీరు చేరే అవకాశం ఉంటుంది. ఈ20లో నీటి శాతం 0.5 శాతానికి మించి పెరిగితే, ఇథనాల్ నీటితో కలిసిపోతుంది. దీంతో "ఫేజ్ సెపరేషన్" అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో నీరు-ఇథనాల్ మిశ్రమం ట్యాంక్ అడుగుభాగంలో చేరిపోగా, పెట్రోల్ పైభాగంలో విడిగా స్టోర్ అవుతుందన్నమాట. అంటే రెండు వేరువేరుగా విడిపోతాయ్.
వాహనాలకు ఎలా చేరుతోంది?
పెట్రోల్ పంపుల్లో ఇంధనం భూగర్భ ట్యాంక్ అడుగుభాగం నుంచి పైపు ద్వారా పంప్ చేయబడుతుంది. దీంతో కొన్ని సందర్భాల్లో పెట్రోల్‌కు బదులుగా నీరు అధికంగా ఉన్న ఇథనాల్ మాత్రమే వాహనాల్లోకి పెట్రోల్ పట్టించుకోవటానికి వెళ్లినప్పుడు మన వాహనంలోకి వస్తాయని బంక్ యజమానులు చెబుతున్నారు. అలాంటి పెట్రోల్ వల్ల వాహనం స్టార్ట్ కాకపోవడం, కొంతదూరం వెళ్లాక ఆగిపోవడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని పెట్రోలు బంకుల్లో భూగర్భ జలాలు స్టోరేజీ ట్యాంకుల్లోకి చేరే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని వివరిస్తున్నారు.
►ALSO READ | రెండు భాషలు చాలు.. మూడో భాష ఎందుకు : CBSE సిలబస్ పై సుప్రీంకోర్టు
బంక్ యజమానుల ఆందోళనలు.. ఐఓసీఎల్ స్పందన
వర్షాకాలంలో భూగర్భ ట్యాంకుల్లో రోజుకు 3 సార్లు, భారీ వర్షాల సమయంలో ప్రతి 2 గంటలకు ఒకసారి నీటి పరీక్షలు నిర్వహించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయని బంక్ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో నీరు చేరటం వల్ల కలుషితమైన ఇంధనాన్ని తొలగించాల్సి వస్తే ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వందల లీటర్లు, మరికొందరు వేల లీటర్ల వరకు పెట్రోలు నష్టపోయినట్లు చెబుతున్నారు. తమకు పెట్రోల్ అమ్మితే వచ్చే మార్జిన్ లాభం కంటే ఈ నష్టాలే కొండలా పేరుకుపోతున్నాయని, ఇలా అయితే బంకులు నడపలేం అని చేతులెత్తేస్తున్నారు.
అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రం పెట్రోల్ నాణ్యత విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెబుతోంది. దేశవ్యాప్తంగా వేలాది ఆకస్మిక తనిఖీలు, నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా కలుషితం లేదా నాణ్యత లోపం తేలితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బంక్ ఓనర్ల చేతిలో లేని అంశాన్ని వారిపై రుద్దటం దానివల్ల లాభాలకు పోయి నష్టాలు రావటం ఇబ్బందిగా మారిందని చాలా మంది డీలర్లు అంటున్నారు. అయితే దీనికి సాంకేతికత ద్వారానే పరిష్కారం కనుకొనాలను చాలా మంది కోరుతున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ స్టోరేజీకి అనుకూలమైన ట్యాంకులు అవసరం అని వారు చెబుతున్నారు. ఇదే ఇలా ఉంటే రానున్న రోజుల్లో బ్యూటనాల్ కలిపిన డీజిల్ వస్తే ఇంకెలాంటి సమస్యలు తమకు చుట్టుకుంటాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
