టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు అసోసియేషన్ పరిమితిని దాటి ఫిల్మ్ ఫెడరేషన్ దృష్టికి చేరాయి. వరుస ఆరోపణలు, రాజీనామాలు, అంతర్గత విభేదాలతో పరిస్థితి వేడెక్కింది. దీంతో తెలుగు చలనచిత్ర మండలి అత్యవసరంగా భేటీ అయింది.
ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. డ్యాన్సర్స్ అసోసియేషన్ కూడా ఫిల్మ్ ఫెడరేషన్‌లో భాగమేనని, సంస్థ నియమ నిబంధనల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసోసియేషన్‌లో నెలకొన్న పరిస్థితులపై అన్ని వర్గాల అభిప్రాయాలను విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల సభ్యులు వరుసగా రాజీనామాలు చేయడం, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం కూడా ఫెడరేషన్ సీరియస్‌గా పరిగణిస్తోంది. డ్యాన్సర్స్ అసోసియేషన్స్ తో ఆదివారం సమావేశం కానున్నట్లు, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అనిల్ తెలిపారు.
మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారితో కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అసోసియేషన్ ఎన్నికల్లో ఫెడరేషన్ జోక్యం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి అంశాలను అసోసియేషన్‌కే వదిలేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
ఇప్పటికే ఇరు వర్గాలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తామంతా ఒక్కటేనని ప్రకటించినప్పటికీ.. అంతర్గత విభేదాలు మాత్రం చల్లారలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇరు వర్గాల వాదనలు, క్రమశిక్షణా ఉల్లంఘనలపై నివేదికలు పరిశీలించిన అనంతరం తీసుకునే నిర్ణయం డ్యాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్తును మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లోని ఇతర కార్మిక సంఘాలకు కూడా ఒక కీలక సందేశంగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
