సోనమ్ వాంగ్‌చుక్‌కు దీపికా పదుకోనే సపోర్ట్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు: వైరల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై ఫ్యాక్ట్ చెక్!

సోనమ్ వాంగ్‌చుక్‌కు దీపికా పదుకోనే సపోర్ట్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు: వైరల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై ఫ్యాక్ట్ చెక్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనేకు సంబంధించిన ఓ న్యూస్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లడఖ్ ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపిందంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత దీపికా దాన్ని డిలీట్ చేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ స్క్రీన్‌షాట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్), రెడిట్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ క్రమంలోనే దీపికా నిజంగానే సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా మాట్లాడిందా? లేక ఇది ఫేక్ ప్రచారమా? అనే చర్చ మొదలైంది.

ముఖ్యంగా దీపికా పదుకునే కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిందంటూ రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు నాంది పలికింది. అయితే ఈ ప్రచారం ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. దీపికా అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అలాంటి ఎలాంటి పోస్ట్ కనిపించలేదని, ఎవరో డిజిటల్ ఎడిటింగ్ ద్వారా నకిలీ స్క్రీన్‌షాట్ తయారు చేసి వైరల్ చేసినట్లు స్పష్టమైంది.

స్క్రీన్‌షాట్‌లో ఏముంది?

వైరల్ అవుతున్న చిత్రంలో దీపికా పదుకోనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సోనమ్ వాంగ్‌చుక్ ఫొటోను షేర్ చేసినట్లు చూపించారు. ఆ ఫొటోపై..‘ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు.. మనం మాత్రం స్క్రోల్ చేస్తూనే ఉన్నాం’ అనే క్యాప్షన్ ఉండటంతో రాజకీయ వర్గాల్లో హీట్ పెరిగింది. అదే సమయంలో..‘ఈ విషయం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? మనం ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి సమయంలో ఉన్నాం’ అంటూ దీపికా వ్యాఖ్యలు చేసినట్లు స్క్రీన్‌షాట్‌లో రాసుకొచ్చారు.

అంతేకాకుండా, ‘విఫలమైన నాయకుడిని గొప్పగా చూపించడానికి ఎన్ని సినిమాలు తీసినా, నిజ జీవితంలోని వాస్తవం మారదు’ అనే వ్యాఖ్యలు కూడా దీపికా పేరుతో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ వైరల్ కావడంతో దీపికా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిందని, ఆ తర్వాత వివాదం కారణంగా స్టోరీని తొలగించిందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ట్రెండ్ అయ్యేలా షేర్ చేస్తున్నారు. 

ఫ్యాక్ట్ చెక్‌లో బయటపడిన నిజం

అయితే ఈ వైరల్ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. దీపికా పదుకోనే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించినా, ఆమె గత సోషల్ మీడియా కార్యకలాపాలను పరిశీలించినా ఇలాంటి స్టోరీకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అలాగే విశ్వసనీయ మీడియా రిపోర్టులు, డిజిటల్ ఆర్కైవ్స్‌లో కూడా దీపికా ఈ పోస్ట్ చేసినట్లు ఎలాంటి రికార్డు లేదు. దీంతో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ డిజిటల్ ఎడిటింగ్ ద్వారా రూపొందించిన నకిలీ చిత్రం అని స్పష్టమైంది.

►ALSO READ | సోనమ్ వాంగ్చుక్ నిరసనకు అతుల్ కుల్కర్ణి మద్దతు.. వన్ డే హంగర్ స్ట్రైక్‌కు పిలుపు!

‘‘దీపికా పోస్ట్ డిలీట్ చేసిందన్న వాదనలోనూ నిజం లేదు. దీపికా ఆ స్టోరీని పెట్టి వెంటనే తొలగించిందన్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఆమె ఆ పోస్ట్ చేసినట్లు రుజువు లేనప్పుడు, దాన్ని డిలీట్ చేసిందని చెప్పడం కూడా తప్పుదోవ పట్టించే ప్రచారమేనని’’ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి స్క్రీన్‌షాట్‌లను నమ్మే ముందు వాటి నిజానిజాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

19వ రోజుకు వాంగ్‌చుక్ నిరాహార దీక్ష..

ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. NEET-UG 2026 పరీక్ష పేపర్ లీక్, పరీక్షల్లో అక్రమాలపై నిరసనగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపే వరకు నిరసన కొనసాగిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంఘీభావం తెలిపారు.

స్వరా భాస్కర్, షబానా ఆజ్మీ, సోనీ రజ్దాన్, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, ఓమీ వైద్య, అనురాగ్ కశ్యప్, మునావర్ ఫరూఖీ తదితరులు వాంగ్‌చుక్‌కు మద్దతు ప్రకటించారు. అయితే దీపికా పదుకోన్ వైరల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ లేదు. ఆమె ఆ పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిందన్న ప్రచారం పూర్తిగా తప్పు అని స్పష్టమైంది.

హైదరాబాద్‌లోని పౌర సమాజ సంస్థలు నిరసన

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పౌర సమాజ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్‌ దీక్షకు సంఘీభావంగా గురువారం (జూలై 16) సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు హైదరాబాద్‎లోని నెక్లెస్ రోడ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి. అనంతరం విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ మార్గ్‎లోని 130 అడుగుల అంబేడ్కర్ విగ్రహం దగ్గర భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చాయి.