కేవలం బరువు తగ్గితే సరిపోదు.. షుగర్ రాకుండా ఉండాలంటే మీ ఒంట్లో ఉండాల్సింది ఏంటో తెలుసా?

కేవలం బరువు తగ్గితే సరిపోదు.. షుగర్ రాకుండా ఉండాలంటే మీ ఒంట్లో ఉండాల్సింది ఏంటో తెలుసా?

మధుమేహం (diabetes ) అనగానే చాలా మంది కేవలం బరువు పెరగడం లేదా ఒంట్లో కొవ్వు ఎక్కువ అవ్వడం వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ, కేవలం కొవ్వు తగ్గించుకుంటే సరిపోదు, శరీరంలో కండరాలు బలహీనపడటం  కూడా మధుమేహానికి ఒక ముఖ్యమైన కారణమని సరికొత్త పరిశోధనలు చెబుతున్నాయి.  

కొత్త అధ్యయనం ఏం చెబుతోందంటే 
ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉండి, అదే సమయంలో కండరాల బలం తక్కువగా ఉన్నవారికి మధుమేహం వచ్చే అవకాశం సాధారణ ప్రజల కంటే మూడున్నర రెట్లు ఎక్కువ అని ఒక కొత్త పరిశోధనలో తేలింది.

ప్రముఖ మెడికల్ జర్నల్ 'డయాబెటిస్ కేర్' లో ప్రచురించిన వివరాల ప్రకారం... కేవలం లావుగా ఉన్నవారితో పోలిస్తే, లావుగా ఉంటూ కండరాల బలం కూడా తక్కువగా ఉన్నవారికి (దీనిని వైద్య భాషలో సార్కోపెనిక్ అంటారు) టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పు 19% ఎక్కువగా ఉంది. అదే విధంగా, కేవలం కండరాలు బలహీనంగా ఉన్నవారితో పోలిస్తే ఈ ప్రమాదం 91% ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

మధుమేహానికి బరువు మాత్రమే కారణమా?
ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు జోంగ్యాంగ్ గువాన్ మాట్లాడుతూ... "డయాబెటిస్ రావడానికి కేవలం శరీర బరువు మాత్రమే కారణం అనే పాత నమ్మకాన్ని ఈ కొత్త పరిశోధన మార్చేసింది" అని చెప్పారు. అధిక బరువు వల్ల మధుమేహం వస్తుందని అందరికీ తెలుసు, కానీ దాంతో పాటు కండరాల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఈ స్టడీ నిరూపించింది.

ఈ పరిశోధన కోసం బ్రిటన్‌కు చెందిన దాదాపు 4,79,607 మంది ఆరోగ్యవంతులపై 14 సంవత్సరాల పాటు నిరంతరం నిఘా ఉంచారు. ఈ కాలంలో వారిలో సుమారు 32,950 మంది మధుమేహం బారిన పడ్డారు.

పరిశోధనలో తేలిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు:
*లావుగా ఉంటూ కండరాలు బలహీనంగా ఉన్నవారిలో సుమారు 15 శాతం మందికి 10 ఏళ్ల లోపే డయాబెటిస్ వచ్చింది.
*కేవలం లావుగా ఉన్నవారిలో ఈ ముప్పు 11 శాతంగా ఉంటే, కండరాల బలం బాగుండి లావుగా లేనివారిలో కేవలం 3 శాతంగా  ఉంది.
*ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఇంకా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు గమనించారు.

ALSO READ : ఆరోగ్యానికి ముగ్గురు మిత్రులు: ఉసిరి, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్..

 ఏం చేయాలి?
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మారియో సియెర్వో మాటల్లో చెప్పాలంటే... డయాబెటిస్ రాకుండా చూసుకోవడానికి కేవలం బరువు తగ్గడం, కొవ్వు కరిగించడం మాత్రమే సరిపోదు. శరీరంలో కండరాలు బలం పెంచుకోవడం కూడా చాలా అవసరం.

కాబట్టి, బరువు తగ్గడానికి డైటింగ్ చేయడంతో పాటు కండరాలు బలంగా మారడానికి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు లేదా వెయిట్ ట్రైనింగ్ చేయడం వంటి సమగ్రమైన పద్ధతులను అలవాటు చేసుకోవాలి.