కిడ్నీలైనా మార్చండి.. చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వండి: రాష్ట్రపతికి ఐదుగురు బాలింతల కన్నీటి లేఖ

కిడ్నీలైనా మార్చండి.. చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వండి:  రాష్ట్రపతికి ఐదుగురు బాలింతల కన్నీటి లేఖ

మాతృత్వం కోసం ఆ తల్లులు పడిన ఆరాటం.. చివరికి అంతులేని ఆవేదనగా మిగిలింది. ప్రసవం తర్వాత కడ్నీలు ఫెయిల్ అయ్యి.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడింది. పేదరికంతో కొంత.. ప్రభుత్వ ఆసుపత్రి అయితే సేఫ్ అన్న ఆశ కొంత.. వారి పాలిట శాపంలా మారింది. చివరికి కారుణ్య మరణానికి అనుమతించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాయడం గుండెలను కరిగించేస్తోంది. రాజస్థాన్ లోని కోటా లో బాలింతల ఆవేదన ఇప్పుడు దేశం మొత్తం కన్నీరు పెట్టుకునేలా చేస్తోంది. 

రాజస్థాన్‌లోని కోటాలో ప్రసవం తర్వాత  కిడ్డీల ఫెయిల్యూర్ తో బాధపడుతున్న ఐదుగురు మహిళలు రాష్ట్రపతికి లేఖ రాయడం వైరల్ గా మారింది. డయాలసిస్ చేయించుకోవడానికి నిరాకరించిన బాలింతలు, మూత్రపిండ మార్పిడి కోసం గత కొద్దరోజులుగా చేస్తున్న  డిమాండ్‌ను మరింత తీవ్రతరం చేశారు. ప్రభుత్వం సరైన చికిత్సను అందించలేకపోతే, చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారి కుటుంబాలు రాష్ట్రపతికి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.

►ALSO READ | 35 ఏళ్ళు పోరాటం చేసి తన భూమి సొంతం చేసుకున్న 103 ఏళ్ళ బామ్మ...!

కిడ్నీ ఫెయిల్ అవ్వటంతో నిత్యం డయాలిసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు తెలిపారు. కిడ్నీ మార్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ డయాలిసిస్ ను నిరాకరించారు.  48 గంటల్లో కిడ్నీ మార్పిడి చేయకుంటే డయాలిసిస్ నిరాకరించి నిరసన తెలపనున్నట్లు అల్టిమేటం జారీ చేశారు.  కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ హామీ లేకుండా డయాలిసిస్ చేసుకునేది లేదని నిరసనకు దిగటం డాక్టర్లను ఆందోళనకు గురిచేసింది. 

ఈ ఘటనపై స్పందించిన న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (NMCH) అధికారులు..  వారికి చికిత్స కొనసాగుతోందని, రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని  తెలిపారు. 

32 రౌండ్ల డయాలసిస్ ..70 రోజులుగా ఆసుపత్రిలోనే.. 

ధన్నీ సుమన్, రాగిణి మీనా, సుశీల మహావార్, పింకీ ఐర్వాల్,  ఆర్తి చౌబ్దార్  అనే  బాలింతలు 2026 మే నెల ఆరంభంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. ప్రసవం తర్వాత  ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పటికే 32 రౌండ్ల డయాలసిస్ చేయించుకున్నారు.  70 రోజులకు పైగా ఆసుపత్రిలోనే ఉన్నారు.


కోటాలోని NMCH, JK లోన్ హాస్పిటల్‌లో సి-సెక్షన్ సర్జరీ తర్వాత పలు సమస్యలతో  ఇప్పటికే మరో ఐదుగురు మహిళలు చనిపోయారు. 

డయాలసిస్ అంటే భయం:

మే ఫస్ట్ వీక్ లో హాస్పిటల్ లో  చేరిన సుమన్, ఇప్పుడుడయాలసిస్ అనే మాట వింటేనే భయపడుతోందని.. ఆమె భర్త మోహన్ లాల్ అన్నారు. డయాలిసిస్ మొదలు పెట్టగానే గంటలోపే ఆమెకు వాంతులు, తీవ్రమైన వణుకు, జ్వరం వస్తాయని కూడా భర్త తెలిపారు. డయాలసిస్ చాలా బాధాకరంగా ఉంటుందని, చాలా రోజులుగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ తమ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని రాగిణి చెప్పారు.

డయాలసిస్ చేయించుకోవాల్సి ఉన్న పింకీ, ఆర్తి ఆ డయాలసిస్ ను నిరాకరించి బయటకు వెళ్లిపోయారు . వైద్యులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. దీనికి తోడు డిశ్చార్జ్ అవ్వాలని వార్డు సిబ్బంది ప్రతిరోజూ మాపై ఒత్తిడి తెస్తున్నట్లు  రాగిణి భర్త లోకేష్ మీనా ఆరోపించారు.

ఐదుగురు మహిళల కుటుంబాలు ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖ రాశాయి. కిడ్నీ మార్పిడి లేదా మరణం రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని పట్టుబట్టాయి. కిడ్నీ మార్పిడి జరగకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని . తమ వినతిపత్రంలో  కోరారు. 

తమ మహిళలు  బాధపడటం మేము ఇక చూడలేము. 48 గంటల్లోగా కిడ్నీ మార్పిడికి .. లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే, డయాలసిస్‌కు తీసుకురావడం మానేసి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు  మోహన్ లాల్ అన్నారు.