విడాకులు తీసుకున్నాడని.. పిల్లాడు కూడా ఉన్నాడని తెలియక ప్రేమాయణం.. తెలిసే సరికి..

విడాకులు తీసుకున్నాడని.. పిల్లాడు కూడా ఉన్నాడని తెలియక ప్రేమాయణం.. తెలిసే సరికి..

బెంగళూరు: బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. తన సోదరుడి ప్రేమను తిరస్కరించిందని ఉన్మాదిలా మారిన ఒక వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేశాడు. జులై 13న బెంగళూరులోని కోడిహళ్లిలోని HAL రోడ్డులోని యువతి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో గాయపడిన యువతి జులై 15న (బుధ వారం) సాయంత్రం చికిత్స పొందుతూ చనిపోయింది. యువతి పేరు అమృత. వయసు 22 సంవత్సరాలు.

దాడికి పాల్పడిన వ్యక్తి, సదరు యువతి ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జీవన్ భీమా నగర్ ప్రాంతంలో ఉన్న యువతిని ఆమె ఇంట్లోనే నిందితుడు కత్తితో పొడిచి దాడి చేశాడు. 22 ఏళ్ల అమృత అనే ఈ యువతి న్యాయశాస్త్రం 4వ సంవత్సరం చదువుతుంది. ఒక పిజ్జా ఔట్ లెట్లో పార్ట్ టైం పనిచేస్తుంది.

దాదాపు మూడేళ్ల క్రితం.. ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరైన సమయంలో.. అమృత కుటుంబానికి, నిందితుడు సూర్య సోదరుడైన ధనుష్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో.. ధనుష్, అమృత ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే.. ఇటీవల అమృతకు ఒక పచ్చి నిజం తెలిసింది. ధనుష్‌కు అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్నాడని.. అతనికి ఒక బాబు కూడా ఉన్నాడనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అమృత దగ్గర ధనుష్ దాచేశాడు. 2026 మార్చిలో ఈ విషయం అమృతకు తెలిసి అప్పటి నుంచి ధనుష్ను దూరం పెట్టింది.

►ALSO READ | కిడ్నీలైనా మార్చండి.. చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వండి: రాష్ట్రపతికి ఐదుగురు బాలింతల కన్నీటి లేఖ

ఈ క్రమంలో.. ధనుష్, అతని సోదరుడు సూర్య అమృతపై, ఆమె కుటుంబంపై పగ పెంచుకున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇప్పుడు విడిపోతానంటే కుదరదని.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. అమృతకు ఈ విషయం చెప్పాలని.. అమృత సోదరుడు తేజస్‌ను ధనుష్, అతని సోదరుడు సూర్య బెదిరించారు. అయినప్పటికీ అమృత దూరం పెట్టడంతో ధనుష్, సూర్య ఆమెపై పగ పెంచుకున్నారు. తన సోదరుడిని దూరం పెట్టిందనే కోపంతో సూర్య అమృత ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు.

అమృత తల్లి సూర్యతో గొడవ పడటంతో క్షణికావేశంలో సూర్య అమృతను కత్తితో పొడిచేశాడు. అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకుని, గాయపడిన యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బెంగళూరు పోలీసులు సూర్య, ధనుష్‌లను అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేశారు.