రెండు భాషలు చాలు.. మూడో భాష ఎందుకు : CBSE సిలబస్ పై సుప్రీంకోర్టు

రెండు భాషలు చాలు.. మూడో భాష ఎందుకు : CBSE సిలబస్ పై సుప్రీంకోర్టు

CBSE సిలబస్ 9వ తరగతిలో మూడు భాషలు తీసుకురావటం వల్ల పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందని.. రెండు భాషలు చాలని.. మూడు భాషల వల్ల విద్యార్థులపై అనవసరపు ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సీబీఎస్ఈ బోర్డు ఎడ్యుకేషన్ లో 9వ తరగతిలోనే మూడు భాషలు ప్రవేశపెట్టటంపై దాఖలైన వివిధ పిటీషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడులోని ప్రతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'జవహర్ నవోదయ విద్యాలయాలను' (JNV) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ బీవీ నాగారత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి  ఈ వ్యాఖ్యలు చేసింది.

అసలు వివాదం ఏంటి?
నవోదయ పాఠశాలల్లో మూడు భాషలు నేర్పించే విధానం (త్రిభాషా సూత్రం) ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలో హిందీని రుద్దుతారనే ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం మొదటి నుండి ఈ స్కూళ్ల ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలక విషయాలను స్పష్టం చేసింది:

 ఈ మూడు భాషల విధానంలో హిందీని ఖచ్చితంగా నేర్చుకోవాలని ఎక్కడా లేదని జస్టిస్ నాగారత్న స్పష్టం చేశారు. రాష్ట్ర భాష (తమిళం), ఇంగ్లీష్‌లతో పాటు  మూడో భాష ఏదైనా చదువుకోవచ్చు. అందులో హిందీనే చదవాలని లేదు అని ఆమె స్పష్టం చేసారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదని మరో వైపు న్యాయవాది చెప్పగా... మీకు హిందీ వద్దు సరే, మరి సంస్కృతం నేర్చుకుంటే తప్పేంటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

9వ తరగతిలోనే ఎందుకు? 
తమిళనాడు తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 9వ తరగతి నుండి మూడో భాష తప్పనిసరి అవుతుందని కోర్టుకు చెప్పారు. దీనిపై జస్టిస్ నాగారత్న స్పందిస్తూ... అది చాలా తప్పు. తొమ్మిదో తరగతి అనేది విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం. అప్పుడు కొత్త భాషను ఎందుకు పరిచయం చేయడం ? ఏవైనా కొత్త భాషలు ఉంటే వాటిని ఆరో తరగతి నుంచే నేర్పించడం మొదలుపెట్టాలి కదా" అని అన్నారు.

ఆమె తన సొంత స్కూల్ రోజులను (1976 నాటి అనుభవాలను) గుర్తు చేసుకుంటూ.. మా చిన్నప్పుడు ఎస్‌ఎస్‌ఎల్‌సి (SSLC) పరీక్షల కోసం మిడిల్ స్కూల్ (ఆరో తరగతి) నుంచే మూడో భాష నేర్పించేవారు. కొత్త భాషలను ఎంత త్వరగా నేర్చుకోవడం ప్రారంభిస్తే అంత మంచిది అని చెప్పారు.

దయచేసి 9వ తరగతిలో మూడో భాషను తీసుకురాకండి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ లేదా రాష్ట్ర బోర్డులైనా సరే.. 10వ తరగతి అనేది బోర్డు పరీక్ష. దాని కోసం విద్యార్థులకు 8వ తరగతి నుంచే టెన్షన్ మొదలైపోతుంది. కాబట్టి 9వ తరగతిలో కొత్త భారం వద్దు, ఏవైనా ఉంటే 6వ తరగతిలోనే పెట్టండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 

తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు సలహా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అనే ఒకే ఒక్క కారణంతో నవోదయ పాఠశాలలను అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి హితవు పలికింది. మీకు సొంత విద్యా విధానం ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వ స్కూళ్లను మాత్రం ఆపకండి. కేంద్రం తెచ్చింది కాబట్టి మేము ఒప్పుకోము అనే పట్టుదలకు పోవద్దు అని సలహా ఇచ్చింది.

ప్రస్తుత పరిస్థితి తమిళనాడులో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని కోర్టు పేర్కొంది. ఆ చర్చలు విఫలమైతేనే తాము తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈ స్కూళ్ల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించేందుకు మరికొంత సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వం కోరడంతో, కోర్టు మరో ఆరు వారాల సమయం ఇచ్చింది.