వెస్టిండీస్ క్రికెట్‌కు ఐసీసీ భారీ ఆర్థిక సాయం.. 122 కోట్ల లోన్‌కు గ్రీన్ సిగ్నల్!

వెస్టిండీస్ క్రికెట్‌కు ఐసీసీ భారీ ఆర్థిక సాయం.. 122 కోట్ల లోన్‌కు గ్రీన్ సిగ్నల్!

West Indies Cricket: స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశాలు కేవలం వన్డే, టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ల మార్పులతోనే కాకుండా పలు సంచలన నిర్ణయాలతో ముగిశాయి. సభ్య దేశాల క్రికెట్ బోర్డుల బలోపేతం, అంతర్గత సంస్కరణలపై ఐసీసీ ఈ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెస్టిండీస్ క్రికెట్‌ను ఆదుకునేందుకు ఐసీసీ ప్రకటించిన భారీ ప్యాకేజీతో పాటు ఐసీసీ సరికొత్త సబ్-కమిటీలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి తన ఆధిక్యాన్ని చాటుకుంది. 

వెస్టిండీస్ క్రికెట్‌కు ఐసీసీ భారీ లోన్: 
గత కొంతకాలంగా తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ (Financial Crisis) ఎదుర్కొంటున్న క్రికెట్ వెస్టిండీస్ (CWI) కి ఐసీసీ ఊహించని రేంజ్ లో భారీ ప్యాకేజీ ప్రకటించింది. విండీస్ క్రికెట్‌ను గట్టెక్కించడానికి ఏకంగా 12.82 మిలియన్ డాలర్ల (సుమారు ₹122 కోట్లు) రుణాన్ని ఐసీసీ మంజూరు చేసింది.

* భారీ నష్టాలు: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆడిట్ నివేదికల ప్రకారం.. 2024లో లాభాల్లో ఉన్నప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో ఆ బోర్డుకు ఏకంగా 28 మిలియన్ డాలర్ల నికర నష్టం వచ్చింది.
* ఫ్యూచర్ ప్రొజెక్షన్: రాబోయే సెప్టెంబర్ 2026 నాటికి మరో 26 మిలియన్ డాలర్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉందని బోర్డు అంచనా వేసింది.
* అంతర్జాతీయ క్రికెట్ ఆదాయ-వ్యయాల చక్రం వల్ల ఏర్పడిన ఈ భారీ ఆర్థిక లోటును పూడ్చడానికి ఐసీసీ సహాయాన్ని విండీస్ బోర్డు కోరగా, ఐసీసీ ఈ భారీ బెయిల్  ఔట్ (Bailout) ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐసీసీ గవర్నెన్స్ కమిటీకి హెడ్‌గా బీసీసీఐ సెక్రటరీ:
ఐసీసీ అంతర్గత వ్యవహారాలు, పారదర్శకతను పర్యవేక్షించేందుకు అత్యంత కీలకమైన గవర్నెన్స్ రివ్యూ కమిటీ (Governance Review Committee) ని ఏర్పాటు చేశారు. ఈ పవర్‌ఫుల్ కమిటీకి చీఫ్ గా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సెలక్ట్ అయ్యారు. ఈ కమిటీలో ఆయనతో పాటు డాక్టర్ మహ్మద్ మూసాజీ (క్రికెట్ సౌతాఫ్రికా), డాక్టర్ రోస్ రివాజ్ (ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్) సభ్యులుగా ఉండనున్నారు. ఐసీసీ నిర్ణయాధికారాల్లో బీసీసీఐ మార్క్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ ఎంపికే ఒక నిదర్శనం.

ఫ్రాంచైజీ క్రికెట్ కమిటీ రేసులోకి తమీమ్ ఇక్బాల్: 
ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 లీగ్‌లు, ఫ్రాంచైజీ క్రికెట్‌ను క్రమబద్ధీకరించడానికి ఐసీసీ సరికొత్తగా ఫ్రాంచైజీ క్రికెట్ కమిటీని రంగంలోకి దించింది. ఈ కమిటీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రస్తుత చీఫ్ తమీమ్ ఇక్బాల్ నేతృత్వం వహించనున్నారు. లీగ్‌లో విండోస్, అంతర్జాతీయ క్రికెట్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ కమిటీ ఒక పక్కా బ్లూప్రింట్ (Blueprint) రెడీ చేయనుంది. ఈ కమిటీలో కూడా బీసీసీఐ తరఫున దేవజిత్ సైకియాతో పాటు రిచర్డ్ గౌల్డ్ (ECB), టాడ్ గ్రీన్‌బర్గ్ (CA), డాక్టర్ రూడీ వాన్ వ్యూరెన్ (నమీబియా) సభ్యులుగా ఉన్నారు.

ALSO READ : 35 నిమిషాల్లోనే వరల్డ్ నంబర్–5కు షాక్..

ఐసీసీ ఫ్యామిలీలోకి నయా ఎంట్రీ: 
క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించే వ్యూహంలో భాగంగా ఐసీసీ గ్లోబల్ మ్యాప్‌లోకి మరో కొత్త దేశం చేరింది. ఆఫ్రికా ఖండానికి చెందిన మారిషస్ (Mauritius) దేశానికి ఐసీసీ అసోసియేట్ మెంబర్‌షిప్ హోదాను కల్పించింది. దీంతో ఐసీసీలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 111 కి చేరింది. ఈ నయా ఎంట్రీతో ఆఫ్రికా రీజియన్‌లో క్రికెట్ మరింత క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ కనిపిస్తోంది.