టాస్ గెలిచిన జట్టుదే పైచేయి?.. కార్డిఫ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ 2వ వన్డేకు ఇదే కీలకం!

టాస్ గెలిచిన జట్టుదే పైచేయి?.. కార్డిఫ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ 2వ వన్డేకు ఇదే కీలకం!

IND vs ENG: భారత్ vs ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో వన్డే సమరానికి కార్డిఫ్ వేదిక సర్వం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేయగా, ఇంగ్లండ్ జట్టుకు ఇది చావో రేవో లాంటి పోరుగా మారింది. కానీ, ఈ అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఇరు జట్ల గెలుపోటములను శాసించబోయేది కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు, మ్యాచ్ ప్రారంభానికి ముందు వేసే టాస్ కూడా డిసైడ్ చేయనుంది. 

టాస్ గెలిచిన జట్టుకే ఎక్కువ అవకాశాలు: 
కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ స్టేడియం చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ టాస్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో జరిగిన మొత్తం 29 వన్డే మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 8 సార్లు మాత్రమే గెలిచింది. అలాగే లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన జట్లు ఏకంగా 19 సార్లు విజయకేతనం ఎగురవేసి ఇక్కడ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. మిగిలిన ఒక మ్యాచ్ టై అయింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, ఈ మైదానంలో పరుగుల కంటే పరుగులను నియంత్రించడమే ఈజీ అని క్లియర్ గా తెలుస్తుంది. 

పేసర్ల హవా.. స్పిన్నర్లకు చుక్కెదురేనా: 
ఇంగ్లండ్ పరిస్థితులకి తగినట్లే కార్డిఫ్ పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా మారుతుంది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో పేస్ బౌలర్లు వేసే స్వింగ్, బౌన్స్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ గ్రౌండ్ లో జరిగిన గత 10 వన్డేల రికార్డులను చూస్తే పేస్ బౌలర్లు ఏకంగా 97 వికెట్లు తీసుకుని ప్రత్యర్థి జట్ల నడుము విరిచారు. మరోవైపు, స్పిన్ బౌలర్లకు ఇక్కడ అంతగా పిచ్ సహకరించకపోవడంతో వాళ్లు కేవలం 45 వికెట్లు మాత్రమే తీసుకున్నారు. అంటే పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లకు సగం కంటే తక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి.  

కెప్టెన్ల వ్యూహం ఏంటి? ముందుగా ఫీల్డింగే మొగ్గు!
పిచ్‌పై ఉన్న కొద్దిపాటి పచ్చిక, ఉదయం పూట ఉండే తేమను ఉపయోగించుకుని ఇరు జట్లలోని ప్రధాన పేసర్లు వికెట్లు తీసేందుకు సిద్ధమైతున్నారు. ఈ వాతావరణాన్ని ముందే అంచనా వేసే ఇరు జట్ల కెప్టెన్లు టాస్ గెలిచిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసి, ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే మిడిల్ ఓవర్లలో టార్గెట్ ని ఈజీగా చేధించాలనేది ఇరు జట్ల ప్రధాన వ్యూహం.