ఇప్పటికే తల ఎత్తుకోలేకపోతుంటే.. ఇప్పుడు ఇదొకటి: సియా గోయల్ ఫ్యామిలీకి మరో బిగ్ షాక్

ఇప్పటికే తల ఎత్తుకోలేకపోతుంటే.. ఇప్పుడు ఇదొకటి: సియా గోయల్ ఫ్యామిలీకి మరో బిగ్ షాక్

ముంబై: ఇప్పటికే కూతురు చేసిన పనికి తల ఎత్తుకోలేకపోతున్న సియా గోయల్ ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. సియా గోయల్ కుటుంబానికి చెందిన మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ దుకాణాన్ని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) అధికారులు సీజ్ చేశారు. అలాగే, రూ.8 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఎఫ్డీఏ అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. 

2026, జూన్ 18న పూణే జిల్లాలోని లోహగడ్ కోటలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి సియా గోయల్‎కు కాబోయే భర్త కేతన్ అగర్వాల్‎ను కొండపై నుండి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సియా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో సియా గోయల్ ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. సియా గోయల్ ఫ్యామిలీ పూణే మార్కెట్ యార్డ్‌లో మెస్సర్స్ బి.జి. గోయల్ అండ్ కంపెనీ పేరుతో స్పైసీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ నిర్వహిస్తోంది. 

బుధవారం (జూలై 15) మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) అధికారుల బృందం ఈ షాపులో సోదాలు నిర్వహించింది. సంత్, సాధు బ్రాండ్‌ల పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ ముక్కలతో సహా నాలుగు ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించింది. ఆహార ఉత్పత్తుల్లో కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలడంతో పాటు  లేబులింగ్‌లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. 

అలాగే, షాప్ ట్రేడ్ లైసెన్స్ కూడా రెన్యూవల్ చేయించలేదని అధికారులు గుర్తించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఈ ఉత్పత్తుల నిల్వను ఎఫ్డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇప్పటికే కూతురు చేసిన పనికి సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్న సియా ఫ్యామిలీకి ఇది మరో ఎదురు దెబ్బ.