అమెరికా సెంట్రల్ బ్యాంకులో ..ఆర్బీఐ మాజీ గవర్నర్ కు కీలక బాధ్యతలు

అమెరికా సెంట్రల్ బ్యాంకులో ..ఆర్బీఐ మాజీ గవర్నర్ కు కీలక బాధ్యతలు

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్  కీలక టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా నియమితులయ్యారు. ఆయనతో పాటు ఢిల్లీలో జన్మించి ప్రస్తుతం అమెరికాలో ప్రముఖ ఆర్థికవేత్తగా గుర్తింపు పొందిన రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ కూడా చోటు దక్కించుకున్నారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ మొత్తం ఐదు టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఫెడ్ పనితీరును ఆధునికీకరించడం వీటి ప్రధాన లక్ష్యం.

ఈ టాస్క్ ఫోర్స్‌లు ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక విధానాలను సమీక్షిస్తాయి. విధాన నిర్ణయాలకు ఉపయోగించే ఆర్థిక గణాంకాల నాణ్యతను మెరుగుపరిచే మార్గాలను సూచిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కొత్త  టెక్నాలజీ భవిష్యత్తులో ఉత్పాదకత, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా అధ్యయనం చేస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం క్రమంలో ఫెడ్ వ్యవస్థను మరింత సమర్థంగా మార్చేందుకు ఈ సంస్కరణలు చేపట్టారు.

ఈ బృందాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్‌మిలన్, నోబెల్ బహుమతి గ్రహీత థామస్ సార్జెంట్, సిలికాన్ వ్యాలీ ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ ఆండ్రీసెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా కెవిన్ వార్ష్ మాట్లాడుతూ, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన ప్రముఖులు ఫెడ్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. వారి సూచనలతో ఫెడరల్ రిజర్వ్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అని తెలిపారు.