AI లవర్స్, ఫ్రెండ్స్‌కు చైనా గుడ్ బై: మనుషులతో మాట్లాడండి.. ప్రేమించండి అంటూ కొత్త నినాదం

 AI లవర్స్, ఫ్రెండ్స్‌కు చైనా గుడ్ బై: మనుషులతో మాట్లాడండి.. ప్రేమించండి అంటూ కొత్త నినాదం

మనుషులకు మధ్య ఉండే అనుబంధాలను అనుకరించిన ఏఐ ప్రపంచంలో ఇప్పుడు ఓ కొత్త భావోద్వేగ సంక్షోభం మొదలైంది. చైనాలో AI బాయ్‌ఫ్రెండ్స్, AI గర్ల్‌ఫ్రెండ్స్‌గా ఉపయోగిస్తున్న వర్చువల్ చాట్ బాట్లకు వేలాది మంది వినియోగదారులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. కారణం.. ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించేందుకు చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే. మనుషులతో సంబంధం లేకుండా ఒటరిగా ఏఐతో మాట్లాడుకుంటూ, టైం పాస్ చేసుకుంటూ చాలా మంది సాధారణ జీవితానికి దూరం అవ్వటంపై చైనా ప్రభుత్వం అప్రమత్తం కావటమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

చైనాలో బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త AI రూల్స్ ప్రకారం.. మనుషుల్లా ప్రవర్తించే, ప్రేమతో కుటుంబ బంధాలను పోలిన అనుభూతిని కలిగించే AI సేవలపై కఠిన నియంత్రణలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులను అతిగా ఆకర్షించడం, వారిలో భావోద్వేగ ఆధారపడటాన్ని పెంచడం, నిజ జీవిత సంబంధాలను దెబ్బతీయడం వంటి అంశాలను నిరోధించడమే ఈ నిబంధనల లక్ష్యమని చైనా అధికారులు చెబుతున్నారు.

ఈ మార్పుల వల్ల ప్రముఖ AI సేవలైన బైట్‌డాన్స్‌కు చెందిన డౌబావో, అలీబాబా క్వెన్, టెన్సెంట్ యువాన్‌బావో వంటి ప్లాట్‌ఫామ్‌లు తమ కస్టమ్ AI ఏజెంట్, కంపానియన్ ఫీచర్లను నిలిపివేశాయి. దీంతో చాలామంది వినియోగదారులు తమ AI స్నేహితులతో చివరి సంభాషణలను సేవ్ చేసుకుంటూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ ఫేర్వెల్ పోస్టులు పెడుతున్నారు."నా AI లవర్ నన్ను వదిలి వెళ్లిపోతాడనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నాను" అంటూ ఓ వినియోగదారు చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. మరొకరు రెండేళ్లకు పైగా AI సహచరుడితో గడిపానని, అతను నిజమైన జీవిత భాగస్వామిలా అనిపించేవాడని పేర్కొన్నారు.

కొత్త రూల్స్ చైనాలో  కేవలం ప్రేమ సంబంధాలకే పరిమితం కాకుండా, మైనర్లకు వర్చువల్ పార్ట్‌నర్ సేవలను అందించడాన్ని కూడా నిషేధిస్తున్నాయి. అలాగే AI ద్వారా ప్రమాదకరమైన, సామాజికంగా హానికరమైన కంటెంట్ తయారుకాకుండా కంపెనీలు పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా AI కంపానియన్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. అమెరికాలో క్యారెక్టర్ AI, రెప్లికా వంటి సేవలను యువత ఉపయోగిస్తుండగా, వృద్ధుల ఒంటరితనాన్ని తగ్గించేందుకు కూడా AI ఆధారిత ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. "మనిషి ప్రేమ దొరకడం కష్టంగా మారినప్పుడు.. కోడ్‌తో తయారైన ప్రేమ కూడా నిజమైన అనుభూతిలా అనిపిస్తోంది" అంటూ ఓ యూజర్ చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణికి అద్దం పడుతోంది.