- తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి
రాంచంద్రాపూర్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో 14.83 లక్షల మంది కార్మికుల పేరుతో దోపిడీ జరిగిందని, రాష్ర్ట ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ 2014–-2023 మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2018 అక్టోబర్లో బోర్డు గడువు ముగిసినా 2020 మార్చి వరకు కొత్త బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు.
2014 నుంచి 2022 వరకు సెస్ వసూళ్లలో భారీ అక్రమాలు జరిగాయని, 8,948 నిర్మాణ అనుమతుల్లో కేవలం 2,394 మంది బిల్డర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యారని తెలిపారు. సుమారు 6,500 మంది నుంచి సెస్ వసూలు చేయలేదని పేర్కొన్నారు. 14.83 లక్షల మంది కార్మికుల్లో 3.34 లక్షల మంది రిజిస్ట్రేషన్లను రెన్యూవల్ చేయలేదని, 62,802 దరఖాస్తులు పెండింగ్లో ఉంచారని ఆరోపించారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.
