- గత నెల 17న ఆంజనేయులు అరెస్ట్, రిమాండ్
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర మాజీ సీఐ అర్పకపల్లి ఆంజనేయులుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆంజనేయులు నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపింది.
కీసర పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆంజనేయులు ఓ వ్యక్తి వద్ద రూ. 8లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అదే పీఎస్లో పనిచేస్తున్న ఎస్ఐ డి గణేందర్ రెడ్డి ద్వారా రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా గత నెల 17న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించారు. దర్యాప్తులో భాగంగా సరూర్నగర్ లింగోజిగూడలోని అంజనేయులు ఇంటితో పాటు 4 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈక్రమంలో రూ.7 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారు ఆభరణాలు (రూ.5 లక్షలు), మారుతి విటారా బ్రెజ్జా జెడ్ ఎక్స్ఐ ప్లస్ కారు (రూ.6.50 లక్షలు) , రూ.10 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్
పరికరాలను గుర్తించారు
బినామీల పేరిట ఆస్తులు!
సరూర్నగర్ లింగోజిగూడలో 150 చదరపు గజాల చొప్పున రెండు ప్లాట్లు (రూ.30 లక్షలు), ఎల్బీనగర్ మన్సూరాబాద్ సీఆర్ ఎన్క్లేవ్లో 240 చదరపు గజాల విస్తీర్ణంలో ఇల్లు (రూ.40 లక్షలు), పెరూరు గ్రామంలో 180 చదరపు గజాల స్థలంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు (రూ.50 లక్షలు) మిర్యాలగూడ హాలియాలో రూ.80 లక్షలు విలువ చేసే రెండు ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హాలియాలో మరికొంత వ్యవసాయ భూమిని కూడా అధికారి కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇప్పటికే గుర్తించిన ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.2.28 కోట్లు కాగా, ప్రస్తుత బహిరంగ మార్కెట్ దాని విలువ పది రెట్లు ఎక్కువగా సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
