- ఇందిరాపార్కు వద్ద టీచర్లసామూహిక నిరాహార దీక్ష
హైదరాబాద్, వెలుగు: విద్యా రంగంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే రద్దు చేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టేట్ యూనియన్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. ఎన్ఈపీ అమలుతో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో పడుతోందని, పేదలకు చదువు దూరమై వేలాది స్కూళ్లు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద టీచర్లు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.
యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షా శిబిరాన్ని చావా రవి ప్రారంభించి, మాట్లాడారు. సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ఈపీని అమలు చేయడం విడ్డూరమని విమర్శించారు. ఎన్పీఎస్, యూపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, 8వ వేతన సంఘం, రెండో పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్ డీఏలు, బిల్లులు విడుదల చేయాలన్నారు.
ఈ దీక్షా శిబిరాన్ని ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, టాప్రా ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అజీజ్, మారావు, ఎల్.అరుణమ్మ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, సీనియర్ నేత పి.మాణిక్ రెడ్డి సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శులు శాంతి కుమారి, సత్యానంద్, సింహాచలం, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
