దుర్గా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి  35  మందికి గాయాలు 

దుర్గా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి  35  మందికి గాయాలు 
  • వర్షం పడటంతో ఎగ్జిట్ గేట్ వైపు జనం పరుగులు
  • పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని కోల్‌‌‌‌‌‌‌‌కతాలో విషాదం 

 

కోల్‌‌‌‌‌‌‌‌కతా:  పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని కోల్‌‌‌‌‌‌‌‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి గిరీష్ పార్క్ ఏరియాలో చోర్ బగాన్ సార్వజనీన్ కమిటీ ఏర్పాటు చేసిన దుర్గాదేవీ మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి గాయాలయ్యాయి. మండపాన్ని చూడటానికి జనం భారీ సంఖ్యలో రాగా.. హఠాత్తుగా వర్షం పడటంతో అందరూ ఒక్కసారిగా ఎగ్జిట్ గేట్ వైపు పరుగులు తీశారు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే కోల్‌కతా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. చాలామంది స్పృహ కోల్పోవడంతో వారిని బైకులపైనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. మండపం ప్రవేశ ద్వారం, ఎగ్జిట్ గేట్లు చాలా ఇరుగ్గా ఉండటం.. ఆ ప్రాంతంలో సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు దుర్గామండపాన్ని పూర్తిగా మూసివేశారు.

విషయం తెలియగానే సీఎం సువేందు అధికారి, సీఎస్​ మనోజ్ అగర్వాల్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.