రష్యాపై ఆంక్షల అమలుకు బ్రేక్..  తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్  

రష్యాపై ఆంక్షల అమలుకు బ్రేక్..  తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్  

 

  • రష్యన్ చమురు కొనుగోళ్లపై 100% టారిఫ్‌‌‌‌‌‌‌‌ల నుంచి మినహాయింపు
  • తాజా ఉత్తర్వులతో భారత్, చైనాకు భారీ ఉపశమనం 

వాషింగ్టన్: రష్యా, ఇరాన్‌‌‌‌‌‌‌‌లపై కఠిన ఆంక్షలు విధించేందుకు తీసుకొచ్చిన 'లిండ్సే గ్రాహామ్ యాక్ట్' అమలును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 18 (ఆదివారం) నుంచే చట్టం అమల్లోకి రావాల్సి ఉండగా.. దానికి ఒక్కరోజు ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా జాతీయ ప్రయోజనాల కోసమే ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వివరణ ఇస్తూ ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. దీంతో రష్యన్ చమురు కొనుగోళ్లపై 100% టారిఫ్‌‌‌‌‌‌‌‌ల అమలుకు బ్రేక్ పడింది.

అయితే, సుంకాల అమలును ఈ ఉత్తర్వులు తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తాయని, భవిష్యత్తులో ట్రంప్ వీటిని ఎప్పుడైనా తిరిగి అమలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ముడిచమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా, స్లోవేకియా, హంగేరి, అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్ వంటి దేశాలపై ఏకంగా 100 శాతం దిగుమతి టారిఫ్‌‌‌‌‌‌‌‌లు విధించాలనే ఉద్దేశంతో అమెరికా లిండ్సే గ్రాహామ్ యాక్ట్ ను తీసుకొచ్చింది. అయితే, ట్రంప్ తాజా నిర్ణయంతో ఆయా దేశాలకు..ముఖ్యంగా భారత్, చైనాలకు ప్రస్తుతానికి ఊరట లభించినట్లయింది.

యుద్ధాన్ని ఆపేందుకే చట్టం

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా యుద్ధాన్ని ఆర్థికంగా నిరోధించడమే లిండ్సే గ్రాహామ్ చట్టం ప్రధాన ఉద్దేశం. మాస్కో సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్న బ్యాంకులు, రష్యన్ అధికారులు, విదేశీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని చట్టాన్ని రూపొందించారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు అమెరికాలో బలమైన మద్దతుదారుడిగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహామ్ పేరు మీదుగా దీనికి 'లిండ్సే ఓ. గ్రాహామ్ రష్యా అండ్ ఇరాన్‌‌‌‌‌‌‌‌లపై ఆంక్షల చట్టం'గా నామకరణం చేశారు. ఈ ఏడాది జూలైలో ఆయన కన్నుమూశారు. చట్టంలోని సెక్షన్ 115 ప్రకారం.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే అధ్యక్షుడు ఆంక్షలు, టారిఫ్‌‌‌‌‌‌‌‌ల అమలు నుంచి మినహాయింపు ఇవ్వడానికి వెసులుబాటు ఉంది. అదే అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ ఈ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.

భారత్​కు ఊరట

ఈ పరిణామాలు భారతదేశానికి కాస్త ఊరటనిచ్చాయి. ఇరాన్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు సరఫరా దెబ్బతిన్న తరుణంలో.. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి భారత్ రష్యన్ ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఒకవేళ అమెరికా 100% టారిఫ్‌‌‌‌‌‌‌‌లు అమలైతే భారత్ ఎగుమతులు, వాణిజ్యం తీవ్ర సంక్షోభంలో చిక్కుకునేవి. ఇటీవల యూఎన్ సమావేశాల సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయి, భారత ఇంధన భద్రత అవసరాలపై చర్చించారు. మరోవైపు.. రష్యాతో అమెరికా ఇటీవల డీజిల్ దిగుమతి ఒప్పందం కుదుర్చుకోవడం.. జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి పరిణామాలు ఆంక్షల నిలిపివేత నిర్ణయానికి దారితీశాయి.