హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందజేస్తామని సదరన్ డిస్కమ్ సీఎండీ జితేష్ వి.పాటిల్ హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని ఫెడరేషన్ హౌస్లో సదరన్ డిస్కమ్ ఆధ్వర్యంలో 6వ స్టేక్హోల్డర్స్ సమావేశం నిర్వహించారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆలస్యంపై సర్చార్జీల తగ్గింపు, సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపు, నెట్ మీటరింగ్ సమస్యలు, అధిక వోల్టేజ్ పారిశ్రామిక వినియోగదారుల కోసం ప్రత్యేక రిలేషన్ షిప్ మేనేజర్ల నియామకం తదితర కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ పరిశ్రమల ప్రతినిధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
