స్టాక్ టిప్స్ ఇచ్చిన యూట్యూబర్‌పై కత్తితో దాడి.. భారీ నష్టాలపై సబ్‌స్క్రైబర్ ఆగ్రహం!

స్టాక్ టిప్స్ ఇచ్చిన యూట్యూబర్‌పై కత్తితో దాడి.. భారీ నష్టాలపై సబ్‌స్క్రైబర్ ఆగ్రహం!

స్టాక్ మార్కెట్‌లో లాభాల కోసం ఇచ్చే టిప్స్ ఒక్కోసారి ఎంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయో దక్షిణ కొరియాలో జరిగిన ఓ ఘటన నిరూపించింది. స్టాక్ పిక్స్ ఇచ్చే ఓ ప్రముఖ కొరియన్ యూట్యూబర్‌పై అతని సబ్‌స్క్రైబర్ కత్తితో దాడి చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. తన పెట్టుబడులు భారీగా నష్టపోయాయని ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

స్టాక్ సలహాలతో నష్టాలు.. ఆపై పగ!
20 ఏళ్ల వయసులో ఉన్న ఓ వ్యక్తి బుసాన్ నగరంలోని ఓ వాణిజ్య భవనంలో యూట్యూబర్‌ను వెంబడించి పలుమార్లు కత్తితో పొడిచాడని పోలీసులు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన నిందితుడిని పోలీసులు దాదాపు 2 గంటల్లోనే అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి యూట్యూబర్ ఇచ్చిన స్టాక్ మార్కెట్ సలహాలను అనుసరించి భారీ మొత్తంలో డబ్బు కోల్పోయాడని అక్కడి వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ప్లాన్ చేసి మరీ దాడి?
పెట్టుబడుల్లో నష్టాల కారణంగా తీవ్ర అసంతృప్తికి గురైన నిందితుడు.. యూట్యూబర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకుని దాడికి ప్రణాళిక వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆయుధాన్ని ఎలా సంపాదించాడు, దాడి వెనుక పూర్తి ఉద్దేశం ఏమిటనే విషయాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. తీవ్ర గాయాలైనప్పటికీ యూట్యూబర్ ప్రాణాపాయ స్థితిలో లేడని సమాచారం.

దక్షిణ కొరియా మార్కెట్లో పెట్టుబడుల జోరు
ఈ ఘటన దక్షిణ కొరియాలో పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. AI డిమాండ్ కారణంగా టెక్ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో సాధారణ పెట్టుబడిదారులు కూడా స్టాక్ మార్కెట్‌లో భారీగా ప్రవేశించారు. ముఖ్యంగా శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లపై పెట్టుబడులు పెరిగాయి. అయితే అధిక లాభాల ఆశతో లీవరేజ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులు మరింత పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : డాక్టర్ మొగుడిని చంపి.. కొడుకును పొడిచి.. తీరిగ్గా ఫోన్ చేసుకుంటూ ఉంది..!

కొరియా మార్కెట్‌లో భారీ ర్యాలీ తర్వాత ఇటీవల ఒక్కసారిగా పతనం రావడం, రోజువారీ భారీ హెచ్చుతగ్గులు కనిపించడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతోంది. స్టాక్ మార్కెట్ లాభాలు ఆశించినా, తప్పు అంచనాలు భారీ నష్టాలకు దారితీస్తే భావోద్వేగ నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. సో పెట్టుబడుల విషయంలో యూట్యూబ్ వీడియోలు, తెలియని వ్యక్తుల నుంచి స్టాక్ మార్కెట్ టిప్స్ వంటివి వీడి ప్రజలు సరైన ఆర్థిక నిపుణులను, సొంత రీసెర్చ్ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని దీనిపై కొందరు అభిప్రాయపడుతున్నారు.