RGV సంచలన ప్రశ్నలు: సెన్సార్ బోర్డును ఎత్తి పడేయండి.. 18 ఏళ్లకు ఓటు వేయొచ్చు కానీ, సినిమా ఎందుకు చూడొద్దు?

RGV సంచలన ప్రశ్నలు: సెన్సార్ బోర్డును ఎత్తి పడేయండి.. 18 ఏళ్లకు ఓటు వేయొచ్చు కానీ, సినిమా ఎందుకు చూడొద్దు?

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన టార్గెట్ చేసింది భారతీయ సినీ సెన్సార్ వ్యవస్థనే. "CENSOR should be BANNED" అంటూ సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ పోస్టులో సెన్సార్ బోర్డు ఉనికిపైనే ప్రశ్నలు లేవనెత్తారు. సినిమాల్లో సన్నివేశాలు కత్తిరించడం ప్రేక్షకులను అవమానించడమేనని, ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ విధానం పూర్తిగా కాలం చెల్లిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ నటించిన ‘జన నాయగన్’పై నడిచిన హై డ్రామా కోలీవుడ్ సినీ వర్గాలనే కంగుతినేలా చేసింది. దాదాపు 6 నెలలకి పైగా మూవీ సెన్సార్ చిక్కుల్లో చిక్కుకుని ఎట్టకేలకు రిలీజ్కు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే సెన్సార్ తీరుపై ఆర్జీవీ లేవనెత్తిన ప్రశ్నలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.

వర్మ అభిప్రాయం ప్రకారం.. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. ఓటీటీలు, సోషల్ మీడియా, అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రపంచంలోని ఏ కంటెంట్‌నైనా క్షణాల్లో చూడగలిగే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ప్రభుత్వ నియామక కమిటీ పెద్దవాళ్లు ఏమి చూడాలో నిర్ణయించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక్కడే ఆయన ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. దేశానికి నాయకుడిని ఎన్నుకునేంత బాధ్యతను 18 ఏళ్ల యువకుడికి ప్రభుత్వం ఇస్తోంది. కుటుంబాన్ని నడపడం, వ్యాపారాలు నిర్వహించడం, సమాజంలో బాధ్యతలు చేపట్టడం వంటి విషయాల్లో నమ్మకం ఉంచుతోంది. కానీ అదే వ్యక్తి ఏ సినిమా చూడాలో మాత్రం ప్రభుత్వం నిర్ణయించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. ఒక తిట్టు పదం వినాలా వద్దా, ఒక హింసాత్మక సన్నివేశం చూడాలా వద్దా అనే నిర్ణయం కూడా ప్రేక్షకుడిదే కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమా అనేది దర్శకుడి దృక్పథాన్ని ప్రతిబింబించే కళారూపమని, దానిని అంగీకరించాలా వద్దా అనేది ప్రేక్షకుడి స్వేచ్ఛ అని వర్మ పేర్కొన్నారు. సెన్సార్ పేరుతో సన్నివేశాలను తొలగించడం వల్ల వాస్తవానికి ప్రయోజనం ఉండదన్నారు. ఎందుకంటే థియేటర్లలో కట్ చేసిన సన్నివేశాలు కొద్ది గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్లు, సోషల్ మీడియా, అంతర్జాతీయ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రజలకు చేరిపోతున్నాయని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ సెన్సేషన్ మూవీ అయినా ‘OBSESSION’ ఉదాహరణగా తీసుకుంటూ.. సెన్సార్ బోర్డు తొలగించిన ఒక సన్నివేశం థియేటర్లలో చూసిన వారి కంటే సోషల్ మీడియా రీల్స్ ద్వారా మరింత ఎక్కువ మంది చూశారని పేర్కొన్నారు. దీంతో సెన్సార్ కంటెంట్‌ను దాచడం కంటే దానిపై మరింత ఆసక్తి పెంచుతుందనే వాదనను ఆయన వినిపించారు.

మరో కీలక అంశాన్ని కూడా వర్మ ప్రస్తావించారు. చిన్నపిల్లలు కూడా ఇంటర్నెట్‌లో హింసాత్మక వార్తలు, వివిధ రకాల కంటెంట్ సులభంగా చూస్తున్న ఈ రోజుల్లో కేవలం సినిమాలపైనే నిషేధాలు విధించడం ద్వంద్వ వైఖరిగా ఆయన అభివర్ణించారు. సినిమా సమాజాన్ని ప్రతిబింబించే సాధనం. చర్చలకు, భిన్నాభిప్రాయాలకు వేదిక కావాలి కానీ, ముందే కత్తిరించి చూపించే మాధ్యమంగా మార్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమాల్లో కత్తిరింపులు అవసరం లేదని, బదులుగా సినిమా ఏ వయస్సు వారికి అనుకూలమో, అందులో హింస, భాష, శృంగారం వంటి అంశాలు ఎంతవరకు ఉన్నాయో స్పష్టంగా తెలియజేసే రేటింగ్ వ్యవస్థ సరిపోతుందని వర్మ సూచించారు. ఆ తర్వాత సినిమా చూడాలా వద్దా అనేది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేయాలని అన్నారు.

ఇంకా నిర్మాతలు, దర్శకులు కూడా సెన్సార్ బోర్డు ముందు రాజీ పడటం మానేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సారి కట్స్‌కు అంగీకరించడం వల్ల సృజనాత్మక స్వేచ్ఛ మరింత బలహీనపడుతోందని, మొత్తం చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్‌గా మారుతోందని ఆయన విమర్శించారు. ప్రస్తుత రూపంలో ఉన్న సెన్సార్ బోర్డు వ్యవస్థను కోర్టుల్లోనూ, ప్రజా వేదికలపైనా సవాలు చేసే సమయం వచ్చిందని పేర్కొన్నారు.

అయితే.. ఈ అంశంపై మరో కోణం కూడా ఉంది. సెన్సార్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నవారి వాదన ఏమిటంటే.. భారతదేశం వంటి విభిన్న సంస్కృతులు, మతాలు, భావోద్వేగాలు కలిసిన దేశంలో కొన్ని సందర్భాల్లో సినిమాల వల్ల సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని, అందుకే పూర్తి నిషేధం కాకపోయినా ఒక నియంత్రణ వ్యవస్థ అవసరమని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతపై ప్రభావం చూపే కంటెంట్ విషయంలో జాగ్రత్త అవసరమనే అభిప్రాయం కూడా ఉంది.

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ‘‘సినిమాలకు సెన్సార్ అవసరమా? లేక కేవలం సర్టిఫికేషన్ చాలు?’’ అనే చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. డిజిటల్ యుగంలో సెన్సార్ వ్యవస్థ కొనసాగాలా? లేక ప్రేక్షకుల విజ్ఞతను నమ్మాలా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.