రెండో తరగతి విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. టీచర్‌పై వేటు

రెండో తరగతి విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. టీచర్‌పై వేటు

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో తీవ్రవివాదం చెలరేగింది. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన సూరాలను హోంవర్క్‌గా ఇవ్వడంతో వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం చేశారు.  వెంటనే స్పందించిన  పాఠశాల యాజమాన్యం స్పందించి, అందుకు బాధ్యురాలైన టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.వివరాల్లోకి వెళితే.. 

సైదాబాద్ ప్రాంతంలోని 'సక్సెస్' అనే ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థికి దీనియాత్ సబ్జెక్టు కింద 'సూరా ఫాతిహా' చదవాలని స్కూల్ డైరీలో హోంవర్క్ రాశారు. అంతకుముందు జూలై11న  కల్మా చదవాలని రాసి, అది ముస్లింయేతర విద్యార్థి అని గ్రహించి టీచర్ దానిని కొట్టివేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి తీవ్ర నిరసన తెలిపారు. విద్యాసంస్థలో ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తల్లిదండ్రుల నిరసనతో స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించింది. ఇది పొరపాటున జరిగినప్పటికీ, ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో 'సక్సెస్' విద్యాసంస్థల గ్రూపులో ఆమె ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకుండా అనర్హురాలిగా ప్రకటించారు. తమ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారని, వారికి 'దీనియాత్' (ఇస్లామిక్ బోధన) సబ్జెక్టు ఉంటుందని, అయితే ఆ సబ్జెక్టును ఇతర మతాల విద్యార్థులకు బోధించమని యాజమాన్యం వివరణ ఇచ్చింది.